నిత్యం ప్రయాణికుల మధ్య విధులు నిర్వహించే.. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు... కరోనా ప్రాణసంకటంగా మారింది. బస్సుల్లో ప్రయాణాలపై కఠిన నిబంధనలు అమలు కానందున.. ఎంత జాగ్రత్తగా ఉంటున్నా... ఏదో ఓ వైపు నుంచి కరోనా దాడి చేస్తోంది. ఇలా కొవిడ్ సోకుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. రెండో దశలో ఇప్పటివరకు.... 748 మంది ఆర్టీసీ ఉద్యోగులు వైరస్ బారినపడ్డారు. శుక్రవారం ఒక్కరోజే 123 మందికి పాజిటివ్ వచ్చింది. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు 105 మంది ఉద్యోగులు కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో బస్సెక్కాలంటనే ఆర్టీసీ సిబ్బంది జంకుతున్నారు. వ్యాక్సిన్ విషయంలోనూ తమపై వివక్ష చూపుతున్నారని వాపోతున్నారు.
పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నా.. కనీస రక్షణ చర్యలు తీసుకోవడంలో యాజమాన్యం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని.. సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కుతున్నారని చెబుతున్నారు. దీని వల్ల భౌతిక దూరం కాదు కదా.. నిల్చోడానికే స్థలం ఉండటం లేదంటున్నారు. కొందరు ప్రయాణికులు, విద్యార్థులు మాస్కులు కూడా ధరించడం లేదని.. చెబితే వాదనకు దిగుతున్నారని వాపోతున్నారు.
బస్సుల్లో కరోనా జాగ్రత్తలపై పర్యవేక్షణ కొరవడిందని... అధికారులు కొవిడ్ భయంతో తనిఖీలు చేయట్లేదని... సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనను కచ్చితంగా అమలు జరిగేలా చూడాలని కోరుతున్నారు. కరోనా సోకిన సిబ్బందికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలంటున్నారు. ఆర్టీసీ సిబ్బందికి బీమా ప్రకటించిన ప్రభుత్వం.. ఇప్పటి వరకు కొవిడ్‌తో మరణించినవారిలో ఎవరికీ చెల్లించలేదని ఆరోపించారు.
సమస్యలు పరిష్కరించాలని.. కార్మిక సంఘాలు.... ఆర్టీసీ ఎండీకి, ప్రభుత్వానికి లేఖలు రాశాయి. ఆర్టీసీ సిబ్బంది ప్రాణాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి