రాజధాని ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదని హైకోర్టు తీర్పు ఇచ్చిందనీ... ఇకనైనా రాజధానిని వైజాగ్‌కు మార్చాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఏపీ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు తులసీరెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విజయవాడలో మాట్లాడిన ఆయన... వైకాపా 19 నెలల పాలనలో ఎన్నో చారిత్రాత్మక తప్పిదాలు చేసిందని ఆరోపించారు. కృష్ణ యాజమాన్య బోర్డును విశాఖలో ఏర్పాటు చేయాలనుకోవటం... తుగ్లక్ నిర్ణయమని దుయ్యబట్టారు.
కృష్ణా నది పరివాహక ప్రాంతానికి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో... బోర్డును ఏర్పాటు చేస్తే ఉపయోగమేమిటని ప్రశ్నించారు. కృష్ణా యాజమాన్య బోర్డును శ్రీశైలం రిజర్వాయర్కి సమీపంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
భాజపా నేతలు ఆలయాల గురించి చేసే యాత్రలు.. దొంగ కొంగ జపం లాంటిదంటూ విమర్శలు గుప్పించారు. తిరుపతి ఉప ఎన్నికల గురించి.. భాజపా, జనసేన, వైకాపా, తెదేపా దొంగ స్నేహాలు చేస్తున్నాయని ఆరోపించారు. రాయలసీమకు అన్యాయం చేస్తున్న ఈ పార్టీలను తిరుపతి ఉప ఎన్నికలో తరమికొట్టాలని ప్రజలకు సూచించారు.
ఇదీ చదవండి: ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పిటిషన్‌పై విచారణ వాయిదా