AP Employees salary: పీఆర్సీ విషయంలో రాష్ట్రప్రభుత్వ నిర్ణయాలతో తెలంగాణతో పోల్చినప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని ఉద్యోగులకు వేతనాల్లో చాలా వ్యత్యాసం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ 23 శాతమే ఫిట్‌మెంట్ ఇవ్వడం, ఇంటి అద్దెభత్యం తగ్గించడం, సీసీఏ తొలగించడంతో తాము నష్టపోతున్నామని ఏపీ ఉద్యోగులు వాపోతున్నారు. సెక్షన్ ఆఫీసర్ కేడర్‌లో ఉన్న ఉద్యోగులకు వేతనంలో రూ.10వేలకు పైగా తేడా కనిపిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఇరు రాష్ట్రాల్లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలు పదోవేతన సవరణ సంఘం సిఫారసుల్ని అమలుచేశాయి. రెండు ప్రభుత్వాలూ ఉద్యోగులకు 43% ఫిట్‌మెంట్ ఇచ్చాయి. అయితే తెలంగాణ కంటే ఏపీలో మాస్టర్‌స్కేల్ మెరుగ్గా ఉండటం, కొన్ని ప్రాంతాల్లో హెచ్‌ఆర్‌ఏ ఎక్కువగా ఉండటంతో కొన్ని కేటగిరీల ఉద్యోగులకు ఏపీలోనే ఎక్కువ వేతనాలుండేవి. తర్వాత 11వ పీఆర్సీ సిఫారసుల అమల్లో భాగంగా 2021 మార్చిలో తెలంగాణ ప్రభుత్వం 30% ఫిట్‌మెంట్ ప్రకటించింది. ఏపీ 27% మధ్యంతర భృతి ఇస్తూ వచ్చింది. తాజాగా 23% ఫిట్‌మెంట్ ప్రకటించింది.
వేతనాల్లో వ్యత్యాసం ఇలా..
- హైదరాబాద్‌లో 2013 పీఆర్సీ ప్రకారం రూ.37,100 కనీస మూలవేతనం ఉన్న సెక్షన్ ఆఫీసర్ కేడర్ ఉద్యోగికి... 2018 పీఆర్సీ ప్రకారం 30% ఫిట్‌మెంట్, 2018 జులై 7 నాటికి 30.392% డీఏ ప్రాతిపదికన లెక్కిస్తే రూ.60,480 (మాస్టర్‌స్కేల్ ప్రకారం తదుపరి స్టేజ్‌లో పెట్టడం వల్ల) కనీస మూలవేతనం వస్తోంది. దానికి 24% హెచ్‌ఆర్‌ఏ, రూ.1,250 సీసీఏ కలిపితే రూ.76,245 వేతనం వస్తోంది. 2019 జనవరి 1 నుంచి 2021 జులై 1 వరకు పెండింగ్‌లో ఉన్న డీఏల్ని కలిపితే ఆ ఉద్యోగికి మొత్తం రూ.88,353 వేతనం వస్తుంది.
- ఆంధ్రప్రదేశ్‌లో 2013 పీఆర్సీ ప్రకారం రూ.37,100 కనీసం మూల వేతనం ఉన్న సెక్షన్ ఆఫీసర్ కేడర్ ఉద్యోగికి... 2018 పీఆర్సీ ప్రకారం 23% ఫిట్‌మెంట్, 30.392% డీఏ లెక్కిస్తే కనీస మూలవేతనం రూ.57,220 (మాస్టర్‌స్కేల్ ప్రకారం తదుపరి స్టేజ్‌లో పెట్టడంతో) అవుతుంది. దానికి 16% హెచ్‌ఆర్‌ఏ కలిపితే రూ.66,375 అవుతుంది. పెండింగ్ డీఏల్ని కలిపితే వేతనం రూ.77,831 అవుతుంది. అంటే తెలంగాణతో పోల్చితే రూ.10,522 తగ్గుతోంది.
- తెలంగాణలో సూపరింటెండెంట్ ర్యాంక్ ఉద్యోగికి 2013 పీఆర్సీ ప్రకారం కనీస మూలవేతనం రూ.28,940 ఉంటే... ప్రస్తుతం అది రూ.47,240కి చేరింది. దానికి 11% హెచ్‌ఆర్‌ఏ, పెండింగ్‌లో ఉన్న డీఏలు కలిపితే మొత్తం వేతనం రూ.61,893కి చేరుతుంది.
- ఆంధ్రప్రదేశ్‌లో 2013 పీఆర్సీ ప్రకారం రూ.28,940 కనీస మూలవేతనం ఉన్న అదే కేడర్ ఉద్యోగికి... 23% ఫిట్‌మెంట్, 30% డీఏ ప్రకారం అది రూ.44,570కి చేరుతుంది. కానీ ఇక్కడ హెచ్‌ఆర్‌ఏ 8 శాతమే. హెచ్‌ఆర్‌ఏతో పాటు, పెండింగ్ డీఏలు కలిపితే వచ్చే మొత్తం వేతనం రూ.57,059. అంటే తెలంగాణకు ఇక్కడికి రూ.4,834 వ్యత్యాసం ఉంది.
ఇదీ చదవండి: SC on Community Kitchen: దేశంలో ఆకలి చావులు లేవంటారా?