విజయవాడలోని బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించకుండా తిరుగుతున్న వారిపై జరిమానాలు విధిస్తామని హెచ్చరించిన కృష్ణా జిల్లా కలెక్టరు ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు. క్షేత్రస్థాయిలో అమలుపై ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బందరు రోడ్డు నుంచి పటమట సెంటరు వరకు బయటకొచ్చే వారంతా మాస్కులు ధరిస్తున్నదీ లేనిదీ స్వయంగా పరిశీలించారు.
మాస్కులు ధరించని వారికి వంద రూపాయలు జరిమానా విధించారు. ఒకటి, రెండుసార్లు జరిమానాలను... ఆ తర్వాత క్వారంటైన్‌కు తరలిస్తామని హెచ్చరించారు. ఎక్కువ మంది మాస్కులు ధరించడంపై కలెక్టరు సంతృప్తి చెందారు. కొందరు చిన్నారులు, యవకులు, వృద్ధులు మాస్కులు ధరించకపోవడాన్ని గమనించి వారికి మాస్కులు అందజేశారు. వీటిని ధరించకపోతే క్వారంటైన్‌కు పంపిస్తామని సున్నితంగా మందలించారు. బందరు రోడ్డులోని ఓ పాన్‌షాపు యజమాని మాస్కు ధరించకపోవడంతో అతనికి జరిమానా విధించారు. నగరవాసులంతా మాస్కులు ధరించేలా చూడాలని పోలీసులకు సూచించారు.
పటమట రోడ్డులోని ఓ చికెన్ జాయింట్స్ ఫుడ్‌డెలివరీ కేంద్రం సిబ్బంది చౌతులకు గ్లౌజులు ధరించకపోవడంతో నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటోనగర్ గేటు వద్ద మురికివాడ వాసులకు మాస్కులు అందజేశారు. ఔషధ దుకాణ యజమానులు సైతం మాస్కులు ధరించకపోవడపై కళ్లెర్రజేశారు. రెండు ఔషధ దుకాణాలను పరిశీలించిన కలెక్టరు... ప్రజలకు మాస్కులు ధరించేలా, కరోనావ్యాధి విస్తృతిని ఆపేందుకు అవగాహన కలిగించాల్సిన ఔషధ దుకాణాల నిర్వాహకులే మాస్కులు లేకుండా ఉండడం క్షమించరాని నేరమని హెచ్చరించారు. తాను మళ్లీ నగరంలో ఆకస్మికంగా పర్యటిస్తానని....అప్పుడు మాస్కులు లేకుండా ఎవరు కంట పడినా చర్యలు తీవ్రంగా ఉంటాయని పేర్కొన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ సిబ్బందిని కలెక్టరు తన వెంట తీసుకెళ్లి జరిమానాలు విధించారు.