కృష్ణా జిల్లాలో కోవిడ్ పాజిటివిటీ రేట్ తగ్గించి.. కరోనా రహిత జిల్లాగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ విజ్ఞప్తి చేసారు. కొవిడ్ మొదటి వేవ్ కన్నా.. ప్రస్తుతం రెండో వేవ్ మరింత వేగంగా విస్తరిస్తోందని తెలిపారు. మొదటి వేవ్‌లో కొవిడ్ పాజిటివిటీ రేటు 5.3 శాతం ఉండగా.. సెకండ్ వేవ్‌లో 12 శాతంగా ఉందన్నారు. రాష్ట్రంలో కొవిడ్ పాజిటివిటీ రేటు 20 శాతం ఉందని.. దానితో పోల్చిచూస్తే జిల్లాలో తక్కువగానే ఉన్నప్పటికీ దీన్ని మరింత తక్కువకు తీసుకువెళ్లేందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు.
జిల్లాలో ఇప్పటి వరకూ 82 వేల మందికి పైగా ప్రజలు కొవిడ్ బారిన పడ్డారని.. ఒక్క మే నెలలోనే 20 వేల మందికి పైగా వైరస్ బారిన పడినట్లు తెలిపారు. దీంతో జిల్లాలోని కొవిడ్ ఆసుపత్రులపై ఒత్తిడి పెరిగిందన్నారు. కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు 60 ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
బ్లాక్ ఫంగస్ వ్యాధిపై ప్రజలెవ్వరూ ఆందోళన చెందవద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కొవిడ్ చికిత్స సమయంలో మధుమేహ స్థాయిని పరిశీలించకుండా మోతాదుకు మించి స్టెరాయిడ్లు అందించిన కారణంగానే కొంతమందికి.. ఈ బ్లాక్ ఫంగస్ సోకిందన్నారు. జిల్లాలో 50 నుంచి 100 వరకు బ్లాక్ ఫంగస్ బాధితులను గుర్తించినట్లు వెల్లడించారు. బ్లాక్ ఫంగస్ అంటువ్యాధి కాదని, దానికి చికిత్స కోసం దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రి లేదా ఈఎన్టీ వైద్యులను సంప్రదించాలని సూచించారు.
ఇవీ చదవండి: