యువ ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి.. 2023 అక్టోబర్ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్ రాజేంద్రన్, అండర్ సెక్రటరీగా మంగేశ్ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆఫ్ ది కేబినెట్ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
2010 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్ సబ్ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్ రాజేంద్రన్ మధ్యప్రదేశ్ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్) ఐఏఎస్ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్ క్యాడర్ అధికారి మంగేశ్ గిల్దియాల్ పీఎంవో అండర్ సెక్రటరీగా నియమితులయ్యారు.