CM Jagan cheated sanitation workers : 2019 జూన్ 20న అసెంబ్లీ వేదికగా పారిశుద్ధ్య కార్మికులపై సీఎం జగన్ ఎంతో ప్రేమ ఒలకబోశారు. వాళ్ల కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకోవాలన్న జగన్.. నాలుగేళ్లవుతున్నా వాళ్ల సమస్యల్ని పట్టించుకోవడం లేదు. కార్మికుల జీతం18 వేలుకు పెంచామని గొప్పగా ప్రకటించారు. కానీ, పెరిగిన నిత్యావసరాల ధరలు, విద్యుత్తు ఛార్జీలతో పోల్చిచూస్తే వారి జీతం ఏమూలకు వస్తుంది. ఇచ్చే వేతనం నుంచే మళ్లీ పాడైన తోపుడు బండ్లకు మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. చీపుళ్లు సొంత డబ్బులతో కొనుగోలు చేయాలా? ఇదేనా కార్మికుల సంక్షేమం?
32 వేలకు పైగా కార్మికులు.. రాష్ట్రంలోని 123 పుర, నగరపాలక సంస్థల్లో, నగర పంచాయతీల్లో పొరుగు సేవల విధానంలో 32 వేల మందికిపైగా పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారు. చట్ట ప్రకారం వీరికి సదుపాయాలు కల్పించడం లేదు. చిన్న పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో రోడ్లు, కాలువలు శుభ్రం చేసేందుకు పనిముట్లు సరఫరా చేయడంలేదు. చెత్త తరలించే బండ్లకు రిపేర్లు వచ్చినా కార్మికులే చేయించుకోవాలి. యూనిఫాం, కొబ్బరినూనె, తువాళ్లు, సబ్బులు, చెప్పులు కూడా చాలాచోట్ల ఇవ్వడం లేదు.
అమలు కాని ఆరోగ్య భృతి.. ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏపీ ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ -ఆప్కాస్ పరిధిలో పట్టణ స్థానిక సంస్థల్లోని 30 వేల మంది పారిశుద్ధ్య కార్మికులను చేర్చారు. ఈ కారణంగా వీరికి మేలు జరగకపోగా... ‘పే స్లిప్పు’ల్లో ఎంప్లాయిగా చూపించి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అనర్హత వేటు వేశారు. కొవిడ్ సమయంలో కార్మికులకు వృత్తిపరమైన ఆరోగ్య భృతి కింద ఒక్కొక్కరికి నెల జీతంతో పాటు 6 వేల రూపాయలు అదనంగా చెల్లిస్తామన్న ప్రభుత్వం.. దాదాపు 2 వేల మంది కార్మికులకు అమలు చేయడం లేదు. రాజధాని అమరావతి పరిధిలోని 24 గ్రామాల్లోని పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య భృతి అమలు కావడం లేదు. గతంలో ఆప్కాస్‌లో చేరక ముందు.. ఉద్యోగ విరమణ చేసిన కార్మికుల పిల్లలకు అవకాశం ఇచ్చేవారు. కానీ, ఇప్పుడు ఆ అవకాశం లేకుండా చేశారు. కార్మిక సంఘాలు గట్టిగా పోరాటం చేయగా... అనంతపురం, విజయవాడ నగరాల్లో కొంతమంది కార్మికుల పిల్లలకు ఉద్యోగ అవకాశం కల్పించారు. మిగిలిన చోట్ల అమలు కావడం లేదు.
పెరుగుతున్న పట్టణీకరణ.. చుట్టుపక్కల గ్రామాలను పుర, నగరపాలక సంస్థల్లో ఎప్పటికప్పుడు విలీనం చేయడం ద్వారా నగరాలు, పట్టణాల విస్తీర్ణం పెరుగుతోంది. అదే స్థాయిలో పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య పెరగడం లేదు. కార్మికులపై అదనపు పని భారం పడుతోంది. శానిటరీ అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని... మహిళా కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్యంతో ఒక్కరోజు విధులకు హాజరుకాకున్నా.. తిరిగి పనిలోకి తీసుకోవడం లేదని వాపోతున్నారు. విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదాల బారినపడినా.. పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. పట్టణాలు, నగరాల్లో ప్రజలందరి ఆరోగ్యం కోసం పాటుపడే జీవితాల్లో.. చీకట్లు అలుముకున్నాయని.. ప్రభుత్వం వెలుగులు నింపాలని పారిశుద్ధ్య కార్మికులు కోరుతున్నారు.