కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గ పరిధిలో ఆదివారం గంటల వ్యవధిలో జరిగిన గొలుసు చోరీలు స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మధ్యాహ్నం హనుమాన్ జంక్షన్ లో బస్సు దిగి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో గొలుసు చోరీ ఘటన జరగ్గా.. సాయంత్రం 5.15 గంటలకు గన్నవరం పట్టణంలోని సెయింట్ జాన్స్ పాఠశాల ఎదుట రోడ్డుపై వ్యాయమం చేస్తున్న బూరగడ్డ కృష్ణకుమారి మహిళ మెడలో 48 గ్రాముల బంగారు గొలుసును స్కూటీపై వచ్చిన దుండగుడు లాక్కెళ్లాడు. సమాచారం అందుకున్న సీఐ శివాజీ బృందం హుటాహుటిన సంఘటన స్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. సీసీ పుటేజ్ సేకరణలో పాఠశాల నిర్వహకులు జాప్యం చేపట్టడంపై బాధిత కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
హనుమాన్‌జంక్షన్‌లో ఆదివారం గుర్తు తెలియని దుండగుడు మహిళ మెడలో గొలుసు అపహరించుకుపోయాడు. స్థానిక కె.ఎస్, టాకీసు రోడ్డులో నివాసం ఉండే తోట హేమలత జంగారెడ్డిగూడెంలో వనసమారాధనకు వెళ్లారు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఆర్టీసీ బస్టాండ్ ఇన్‌గేట్ ఎదురు సందులోంచి నడుచుకుని ఇంటికి వెళుతుండగా, ద్విచక్ర వాహనంపై వెనక నుంచి వచ్చిన ఆగంతకుడు ఆమె మెడలోని బంగారు మంగళసూత్రం, నల్లపూసల గొలుసు పట్టుకుని గట్టిగా లాగాడు. నల్లపూసల గొలుసు పూర్తిగా మంగళసూత్రపు గొలుసు పాక్షికంగా చేజిక్కించుకుని పరారయ్యాడు. హనుమాన్‌జంక్షన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీచదవండి: