CS Jawahar Reddy talks with AP JAC Amaravati leaders : ఏపీ జేఏసీ అమరావతి నేతలతో క్యాంప్ ఆఫీస్‌లో సీఎస్ జవహర్ రెడ్డి చర్చలు జరిపారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ 85 రోజులుగా ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమ కార్యాచరణ చేపట్టింది. ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మిక, విశ్రాంత కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం కొనసాగిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 13 న ఏపీ జేఏసీ ఉద్యోగుల సంఘం సీఎస్‌కు 50 పేజీల మెమోరాండం ఇచ్చింది.
చర్చలపై సంతృప్తి... రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఏపీ జెఏసీ అమరావతి నాయకుల సమావేశం ముగిసింది. చర్చలపై జేఏసీ నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీ జేఏసీ గత 84 రోజులుగా చేస్తున్న ఉద్యమాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చర్చలకు పిలిచిందని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని తాము కోరామని.. ఆ మేరకు కొన్ని సమస్యలపై సీఎస్ తక్షణమే స్పందించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారని బొప్పరాజు వెల్లడించారు. వీఆర్ఏల డీఏతో పాటు వీఆర్వో గ్రేడ్ 2 కు సంబంధించిన అంశాలు తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. 180 రోజులు మహిళా ఉద్యోగుల మెటర్నటీ లీవ్ ను ప్రొబేషన్ సమయంలో డ్యూటీ పీరియడ్ గా పరిగణించాల్సిందిగా తాము కోరామన్నారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులపై సుదీర్ఘ సమయం చర్చలు జరిపామని చెప్పారు. వెల్ఫేర్ సెక్రటరీ పేరు మార్చడంతో పాటు పదోన్నతులు కల్పించాలని కోరినట్లు తెలిపారు. మహిళా సెక్రటరీలు మహిళా పోలీసులుగా సేవలందించడంపై అభ్యంతరం వ్యక్తం చేశామని వివరించారు.
లిఖితపూర్వక హామీ ఇస్తేనే... సీఎస్ చాలా అంశాలపై సానుకూలంగా స్పందించారని తెలిపారు. జూన్ 7న జరిగే కేబినెట్ సమావేశంలో మిగిలిన అంశాలపై జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేసి చర్చిస్తామని చెప్పారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఉద్యోగులకు అనుకూలంగా లిఖితపూర్వకంగా హామీ ఇస్తే అప్పుడు చర్చించి ఉద్యమంపై ఆలోచన చేస్తామని బొప్పరాజు స్పష్టం చేశారు. ఎప్పుడూ లేని విధంగా చాలా సమయం కేటాయించి తమతో సీఎస్ చర్చలు జరిపినందుకు ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతున్నామన్నారు.
ఏపీ జేఏసీ అమరావతి 85రోజులుగా చేస్తున్న ఉద్యమాన్ని ప్రభుత్వం గుర్తించి చర్చలకు పిలవడంపై సంతోషిస్తున్నాం. చాలా విషయాలపై వివిధ శాఖా పరమైన అంశాలపై చర్చించాం. దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలపై దృష్టి సారించాలని కోరాం. రెవెన్యూలో వీఆర్ఏలకు కరోనా సమయంలో వాయిదా వేసిన 10శాతం వేతనాన్ని చెల్లించాలని కోరడంతో ఇవాళ సాయంత్రం జరిదే కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఆ విషయాన్ని చర్చిస్తామని చెప్పారు. డీఏ చెల్లింపు అంశంపైనా చర్చిస్తామన్నారు. గ్రేడ్ 2 పేస్కేల్ విషయంలో సీసీఎల్ఏ గారితో మాట్లాడి ఫైనల్ చేస్తామన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల విద్యార్హతల అంశంపై పాత విద్యార్హతలే అమలు చేయాలని కోరడంతో సానుకూలంగా స్పందించారు. గుర్తింపు సంఘాల ఉత్తర్వులు కూడా అమలు చేస్తామని తెలిపారు. డీఆర్డీఏ సిబ్బందిని పంచాయతీ రాజ్ శాఖలో విలీనం చేయాలని కోరాం. - బొప్పరాజు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్