1902 toll free number : ఎంతో కాలంగా పరిష్కారం కాని ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసమే జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. 1902 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేస్తే ఫిర్యాదు నమోదు చేసుకుని పరిష్కరిస్తామన్నారు. సమస్య పరిష్కారమయ్యే వరకు ముఖ్యమంత్రి కార్యాలయం పర్యవేక్షిస్తుందని తెలిపారు. మారుమూల గ్రామాల నుంచి జిల్లా, సచివాలయం, సీఎంవో వరకు అన్ని స్థాయిల్లో అధికారులందరినీ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తున్నట్లు తెలిపారు. పరిపాలనలో మెరుగులు దిద్దేలా ఈ కార్యక్రమం తీసుకువస్తున్నామని ప్రజలంతా వినియోగించుకోవాలని సూచించారు.
లాంఛనంగా ప్రారంభం.. ప్రజలు తమ సమస్యలను తెలిపేందుకు "జగనన్నకు చెబుదాం" పేరిట కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కిన సీఎం జగన్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ప్రజలు సమస్యను చెప్పేందుకు ఏర్పాటు చేసిన 1902 టోల్‌ఫ్రీ నెంబర్‌ను ప్రారంభించారు. ఫిర్యాదులు స్వీకరించి సత్వర పరిష్కారం అందించడం కోసం కార్యక్రమం చేపట్టినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఎవరికైనా అర్హత ఉన్నా సంక్షేమ పథకాలు అందని పరిస్థితులు ఉన్నా, న్యాయం మీ వైపున ఉన్నా.. జరగని పరిస్థితులు ఉన్నా 1902 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేయవచ్చని సీఎం తెలిపారు. వివక్ష, లంచాలకు చోటులేని వ్యవస్థను తీసుకువచ్చేలా విప్లవాత్మక అడుగులు వేస్తూ వచ్చామన్న సీఎం.. అందులో భాగంగా స్పందన కార్యక్రమాన్ని తీసుకువచ్చామన్నారు. స్పందన ద్వారా గ్రామ సచివాలయం నుంచి కలెక్టర్ల దాకా స్పందించి సమస్యలు తీర్చేలా ఇప్పటికే ఏర్పాట్లు చేశామన్నారు. ప్రజలు హక్కుగా అందాల్సిన సేవ అందకపోయినా, అసాధారణ జాప్యం జరగకుండా చర్యలు తీసుకున్నామని, స్పందనకు ఇంకా మెరుగులు దిద్దుతూ జగనన్నకు చెబుతాం కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
1902 నంబర్ కు ఫోన్ చేయాలి.. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో 1902 నెంబర్ కు ఫోన్ చేయాలని సీఎం కోరారు. ఏ సంక్షేమ పథకమైనా రాని పక్షంలో, భూముల రికార్డులకు సంబంధించిన సమస్యలైనా ఫోన్ చేయవచ్చన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా సత్ఫలితాలు రాని పరిస్థితి ఉంటే కార్యక్రమం ద్వారా నేరుగా సీఎం దృష్టికి తీసుకురావచ్చన్నారు. 1902 నెంబర్ కు ఫోన్ చేస్తే నేరుగా సీఎం కార్యాలయానికే ఫోన్ వస్తుందని, సమస్య చెప్పాక ఓ వైఎస్ఆర్ పేరిట యునిక్ ఐడీ ఇస్తామన్నారు. యునిక్ ఐడీ ప్రకారం సమస్య పరిష్కారం అయ్యే వరకు సీఎంవో పర్యవేక్షిస్తుందన్నారు. ఫిర్యాదు స్థితిని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ఫిర్యాదుదారుడికి సమాచారం ఇస్తామన్నారు. మండల, జిల్లా, సచివాలయం, సీఎంవోలో ఈ ప్రాజెక్టు పర్యవేక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపిన సీఎం... సీఎంవో, సీఎస్, డీజీపీ ముగ్గురూ డ్రైవ్ చేస్తూ పర్యవేక్షించేలా బాధ్యతలు ఇచ్చినట్లు తెలిపారు. ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేస్తూ సమస్య పరిష్కరించేలా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సమస్య పరిష్కరించి తద్వారా ఫిర్యాదు దారు మెహంలో చిరునవ్వును చూపించేలా చర్యలు తీసుకుంటారన్నారు. సమస్య పరిష్కారం అయ్యాక ఫిర్యాదు దారుడి ఫీడ్ బ్యాక్ కూడా తీసుకుంటారన్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం పర్యవేక్షణ కోసం సీనియర్ అధికారులను నియమించామన్న సీఎం.. సీనియర్ ఐఎఎస్,ఐపీఎస్ అధికారులను స్పెషల్ అధికారులను పర్యవేక్షణ కోసం నియమించామన్నారు. నిరంతరం జిల్లాల్లో తిరుగుతూ సమస్యల పరిష్కారం కోసం పర్యవేక్షణ చేస్తారన్నారు. జగనన్నకు చెబుదాంలో ఎంత తక్కువ సమస్యలు వస్తే ప్రభుత్వం అంత సమర్థంగా పని చేస్తున్నట్లు లెక్క అని సీఎం అన్నారు. సచివాలయ స్థాయిలో సమస్యలు పరిష్కారమైతే ఫిర్యాదులు తక్కువగా వస్తాయని ఈ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రజలకు ఇంకా మంచి జరగాలని కోరుకుంటూ జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభిస్తున్నామని, ప్రజలకు ప్రభుత్వం మరింత దగ్గరయ్యేందుకు చేస్తున్నట్లు తెలిపారు. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికార యంత్రాంగమంతా కలసి కట్టుగా పని చేయాలని సీఎం సూచించారు.
ఇవీ చదవండి :