VAO Suicide case: కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం భోగిరెడ్డిపల్లి గ్రామ వీవోఏ గరికపాటి నాగలక్ష్మి ఆత్మహత్య కేసుకు సంబంధించి సీఐ, ఎస్సైలకు జిల్లా ఎస్పీ సిద్ధార్థకౌశల్ ఛార్జ్‌మెమోలు జారీ చేశారు. గ్రామంలోని ఓ స్వయం సహాయక సంఘానికి రుణం ఇచ్చే విషయంలో తలెత్తిన వివాదంలో తనకు మాన, ప్రాణ రక్షణ కల్పించాలంటూ గత నెలలో నాగలక్ష్మి మచిలీపట్నం తాలూకా స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అక్కడ కేసు నమోదు చేయకపోవడంతో ఈనెల 14న ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే స్పందనలో ఫిర్యాదు చేయగా, విచారించి చర్యలు తీసుకోవాలని ఎస్పీ.. తాలూకా సీఐకి ఎండార్స్ చేశారు. అయినా చర్యలు లేవన్న ఆవేదనతో మనోవ్యథకు గురై ఈ నెల 16న నాగలక్ష్మి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
ఫిర్యాదు చేసినా పోలీసులు సకాలంలో స్పందించకపోవడం వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడాల్సి వచ్చిందన్న విషయం ప్రసార మాధ్యమాల్లో రావడంపై స్పందించిన ఎస్పీ.. ఫిర్యాదును పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించారన్న కారణంతో మచిలీపట్నం తాలూకా సీఐ వీరయ్యగౌడ్, తాలూకా ఎస్సై వాసుకు శనివారం ఛార్జ్‌మెమో ఇచ్చారు. కిందిస్థాయి సిబ్బంది ఏం చేస్తున్నారనే విషయంలో పర్యవేక్షణ లోపించిందంటూ.. మచిలీపట్నం డీఎస్పీ మాసుంబాషాకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఈ సంఘటనపై పూర్తి విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:
POLAVARAM : పోలవరం ప్రాజెక్టు నిధుల విషయంలో కేంద్రం మరో మెలిక