రాజధాని అమరావతి వ్యవహారంలో ప్రభుత్వ తీరుపై.. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో.. ఐకాస నేతలతో కలిసి జోలె పట్టిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం తీరుపై ప్రజలందరూ సంఘటిత శక్తిగా మారాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి ప్రజలు గొప్ప సందేశం ఇవ్వాలన్నారు. జేఏసీ ఏర్పాటు చేసి అన్ని పార్టీలు ఏకమయ్యాయన్న చంద్రబాబు... అన్ని పార్టీలు ఒకే వేదిక మీద కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. ప్రజలను చైతన్య వంతం చేయడానికి బస్సు యాత్ర తలపెట్టామన్నారు. చివరి నిమిషంలో బస్సు యాత్రకు పోలీసులు అనుమతి లేదని.. బస్సు యాత్రకు రూట్ మ్యాప్ ఇవ్వనందున అనుమతి లేదని పోలీసులు చెప్పారన్నారు. తాము డీజీపీని కలిసి కోరినా బస్సు యాత్రకు అనుమతి ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
''రాజధాని ఉద్యమానికి ప్రజలు ఉదారంగా ముందుకు వచ్చారు. ఉద్యమానికి మహిళలు తమ నగలను విరాళంగా ఇచ్చారు. ప్రజలు స్ఫూర్తిదాయకంగా ముందుకువస్తున్నారు. రాజధాని అడిగితే మూడు పేర్లు చెబుతారా? నాపై ఉండే కోపం రాజధాని అమరావతిపై చూపవద్దు. ల్యాండ్ పూలింగ్‌లో రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారు. రైతులు భూములు త్యాగం చేస్తే.. స్థిరాస్తి వ్యాపారం కోసం అంటున్నారు. రైతులు గుండె ఆగి చనిపోతే పరామర్శించే నైతిక బాధ్యత తీసుకోలేదు. విశాఖను రాజధాని చేయాలని ఎవరైనా అడిగారా?'' అని చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు.