రాష్ట్రంలో 69 నదులు ఉన్నాయి.. ఈ నదులను పువ్వులుగా భావించాను.. ఈ పువ్వులతో పోలవరం అనే దారంతో దండ చేయాలనుకున్నాను.. ఆ దండను తెలుగుతల్లి మెడలో మణిహారంగా వేయాలనుకున్నాను. - చంద్రబాబు నాయుడు
Chandrababu analysis on Polavaram: పోలవరానికి జగనే శని.. ఈ శని పోతే తప్ప పోలవరం కల సాకారం కాదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. అహంకారంతో పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారని ఆయన మండిపడ్డారు. పోలవరం వాస్తవ స్థితిగతులపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రదర్శన ఇచ్చారు. పోలవరం పూర్తైతే ఏపీలోని అన్ని ప్రాజెక్టులకు నీళ్లివ్వొచ్చని ఆయన తెలిపారు. పరిశ్రమల అవసరాలకు నీటి సౌకర్యం కల్పించవచ్చని అన్నారు. పోలవరం పునరావాసానికి తెలుగుదేశం హయాంలో రూ.4114 కోట్లు ఖర్చు పెట్టామన్న ఆయన.. వైసీపీ హయాంలో నిర్వాసితుల కోసం కేవలం రూ.1890 కోట్లే ఖర్చు చేశారని విమర్శించారు.
పోలవరం నిర్వాసితులకు ఎకరానికి రూ.19 లక్షలు ఇస్తామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కారని చంద్రబాబు దుయ్యబట్టారు. పరిహారం ఇవ్వకపోగా లబ్ధిదారుల జాబితా మార్చి అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రమాణ స్వీకారం రోజునే పోలవరం పనులను నిలిపేసిన ఘనత జగన్‌దేనని విమర్శించారు. 15 నెలల పాటు పోలవరం వద్ద ఎలాంటి నిర్మాణ సంస్థే లేకుండా చేశారన్న ఆయన.. కాంట్రాక్టరును మార్చొద్దని పీపీఏ చెప్పినా జగన్ వినలేదని అన్నారు. పీపీఏ స్పష్టంగా చెప్పినా మూర్ఖుడు కాంట్రాక్టరును మార్చారని మండిపడ్డారు. నాటి వైఎస్ ప్రభుత్వం చిక్కుముళ్లను విడదీసి... తెలుగుదేశం హయాంలో రూ.11537 కోట్లు ఖర్చు పెడితే.. జగన్ కేవలం రూ.4611 కోట్లతో సరిపెట్టారన్నారు. తెలుగుదేశం హయాంలో 45.72 మీటర్ల ఎత్తున పోలవరం నిర్మించాలనుకుంటే.. జగన్ 41.15 మీటర్ల ఎత్తుతోనే సరిపెడుతున్నారని చంద్రబాబు ఆక్షేపించారు.
- పోలవరం పూర్తయితే రైతులకు, రాష్ట్రానికి కలిగే లబ్ధిపై ఎన్నో కలలు కన్నాం.. మొత్తం నాశనం చేశారు
- పోలవరం పునరావాసానికి తెలుగుదేశం రూ.4114 కోట్లు ఖర్చు చేస్తే.. వైసీపీ ఖర్చు చేసింది కేవలం రూ.1890 కోట్లే
- ప్రభుత్వం తప్పు చేసిందని విమర్శిస్తే తిడతారు. ముసలి నక్కా అంటావ్.. ఇదే జగన్ చేయగలిగింది.
- సీఎం జగన్ గట్టిగా ఓ గంటసేపు కూర్చొని ఫైల్ చూడలేడు.. బూతులు తిట్టడం తప్ప ఏమైనా చేయగలడా..?
- పేదల పొట్ట కొట్టి జగన్ తన పొట్ట పెంచుకుంటున్నాడు.. పోలవరానికి ఎందుకెళ్లకూడదు.. అదేమైనా పాకిస్తాన్లో ఉందా..?
- పోలవరం ప్రాజెక్టు అంటే వైసీపీ నేతలకు నవ్వులాటగా మారిపోయింది.. ఏపీ ప్రజల జీవితాలను నవ్వులాటగా మార్చారు.
ఏపీకి సాటి లేదు.. పోలవరం పూర్తైతే ఏ రాష్ట్రమూ ఏపీతో పోటీ పడలేదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. పోలవరం నిర్మాణం.. ఆ తర్వాత పేదలకు, రైతులకు కలిగే లబ్ధిపై ఎన్నో కలలు కన్నాం.. మొత్తం నాశనం చేశారని దుయ్యబట్టారు. ఐదేళ్లు వర్షాలు రాకున్నా.. ఏపీకి ఇబ్బంది లేని పరిస్థితి ఉండేదని అన్నారు. తన ఆకాంక్షను.. రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 69 నదులు ఉన్నాయి.. ఈ నదులను పువ్వులుగా భావించానన్న ఆయన... ఈ పువ్వులను పోలవరం అనే దారంతో దండ చేయాలనుకున్నామని, ఆ దండను తెలుగుతల్లి మెడలో మణిహారంగా వేయాలనుకున్నామని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఆర్అండ్ఆర్ రాష్ట్రమే చేసుకోవాలంటే.. గడ్కరీ, అరుణ్ జైట్లీతో వాదించానన్నారు. ఏ సెక్షన్ కింద.. ఏ చట్టం కింద ఆర్అండ్ఆర్ ఇవ్వనంటున్నారని ప్రశ్నించానని తెలిపారు. గడ్కరీ, అరుణ్ జైట్లీ కూడా ఏం మాట్లాడలేకపోయారన్న చంద్రబాబు.. అదీ తన చిత్తశుద్ధి అని అన్నారు. తాను ప్రాజెక్టుల వద్దకెళ్తున్నా.. అక్కడే నిలదీస్తానన్నారు. ప్రభుత్వం తప్పు చేస్తుందంటే తిడతారు.. అంతేగా.. ముసలి నక్కా అంటావ్.. ఇదే జగన్ చేయగలిగిందని విమర్శించారు. గట్టిగా ఓ గంట కూర్చొని ఫైల్ చూడలేవు.. బూతులు తిట్టడం తప్ప ఏమైనా చేయగలరా..? అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెత్తందారీ జగన్ కాదా.. పేదల పొట్ట కొట్టి జగన్ తన పొట్ట పెంచుకుంటున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. పేదలను దోచుకుని రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసే జగన్ పేదలకు.. పెత్తందార్లకు పోరాటం అంటారా అని మండిపడ్డారు. పెత్తందారెవరు.. జగన్ కాదా అంటూ నిలదీశారు. పోలవరం ప్రాజెక్టును.. ప్రజల జీవితాలను నవ్వులాట చేసేశారన్న ఆయన... ఇది మన ఖర్మ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు వైసీపీ నేతలను కాంక్రీటు వేసి సమాధి చేయాలన్నారు. పోలవరం హైడల్ ప్రాజెక్టు ఊసే లేకుండా పోయిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
పోలవరం పాకిస్థాన్‌లో ఉందా..? ఆనాడు పర్యాటక ప్రాంతంగా ఉండే పోలవరాన్ని నేడు నిషేధిత ప్రాంతంగా చేశారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. పోలవరానికి ఎందుకెళ్లకూడదు.. అదేమైనా పాకిస్తానా అని ఆయన ప్రశ్నించారు. గతంలో తాము ఇచ్చిన అంచనాలను తప్పు పట్టి.. ఇప్పుడు ఆ అంచనాల ఆధారంగానే నిధులు అడుగుతున్నారని విమర్శించారు. పోలవరం కొత్త అంచనాలకు ఆమోదం రాకుండా నాడు కేంద్రం వద్ద వైసీపీ నేతలు లాబీయింగ్ చేశారని ఆరోపించారు. జగన్‌లాంటి ద్రోహులకు సహకరిస్తే.. వాళ్లూ రాష్ట్ర ద్రోహులేనన్నారు. 2020లో వరదల వల్ల డయాఫ్రం వాల్ దెబ్బతింటే తమని విమర్శిస్తారా..? అని చంద్రబాబు మండిపడ్డారు. డయాఫ్రం వాల్ 2020 వరదల వల్లే దెబ్బతిందని జగన్ ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీనే తేల్చిందని అన్నారు. డయాఫ్రం వాల్ దెబ్బ తిందని రెండేళ్ల తర్వాత గుర్తించిన స్థితిలో ఉంది ఈ ప్రభుత్వమని దుయ్యబట్టారు. గైడ్ బండ్ కూడా కుంగటంతో పోలవరంలో ఇంకేం మిగిలిందని ప్రశ్నించారు. ఇన్ని తప్పిదాలు జరిగితే.. ఆంబోతు రంకెలేస్తారా అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.