Chandrababu met TDP ranks : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ శ్రేణులతో చంద్రబాబు భేటీ అయ్యారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు.. పార్టీ ఇన్‌ఛార్జ్‌ల పనితీరుకు పరీక్ష అని ఆయన పేర్కొన్నారు. మండలి రద్దుకు తీర్మానం చేసిన సీఎం జగన్కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు లేదని చంద్రబాబు మండిపడ్డారు. శాసన మండలి దండగ అంటూనే ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు.
గతంలో శాసన మండలి రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన సీఎం వైఎస్ జగన్కు... ఇప్పుడు పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు ఉందా..? అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. తన మాట నెగ్గలేదనే అహంకారంతో నాడు జగన్.. ఏకపక్షంగా మండలి రద్దుకు తీర్మానం చెయ్యలేదా అని నిలదీశారు. మండలి వ్యవస్థను అగౌరవపరిచిన ముఖ్యమంత్రి.. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థులను నిలబెట్టి ఓట్లు అడుతారని మండిపడ్డారు.
ప్రభుత్వ వ్యతిరేకతను అనుగుణంగా మలుచుకోవాలి... పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నికలపై పార్టీ ఇంచార్జ్లు, ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలో తీవ్రంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను తెలుగుదేశానికి అనుకూలంగా మార్చుకోవాలని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నిలబెట్టిన అభ్యర్థులను గెలిపించాలని నేతలకు సూచించారు. పాలనలో అన్ని విధాలా విఫలమైన జగన్ తీవ్ర అసహనంతో ఉన్నాడని.. అందులో భాగంగానే రాష్ట్రంలో టీడీపీ నేతల పర్యటనలు, సభలపై ఆంక్షలు పెడుతున్నారని విమర్శించారు. ప్రజలు ప్రభుత్వ వ్యతిరేక గళం వినిపిస్తుండడంతో దాడులు, హింసా ఘటనలతో భయపెట్టాలనే ప్రయత్నాలు మొదలుపెట్టారని దుయ్యబట్టారు. కరుడుగట్టిన ఉగ్రవాదిలా సీఎం ప్రవర్తిస్తుంటే... కొందరు పోలీసులు బాధ్యత మరిచి జగన్కు ఊడిగం చేస్తున్నారని మండిపడ్డారు.
టీడీపీ అభ్యర్థికి ఉద్యోగుల మద్దతు... వైఎస్సార్సీపీ సర్కార్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఉద్యోగ, ఉపాధ్యాయ, రిటైర్డ్ ఉద్యోగులందరూ సిద్ధం కావాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్జీవోల సంఘం, రెవెన్యూ ఉద్యోగుల సంఘం మాజీ ఉపాధ్యక్షుడు మునయ్య పిలుపునిచ్చారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. కడప ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ, పెన్షనర్లకు ప్రస్తుత ప్రభుత్వం తీరని నష్టం, అవమానాలకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్మోహన్ రెడ్డి సర్కార్ 10వ పీఆర్సీలో ఉద్యోగ, ఉపాధ్యాయ, రిటైర్డ్ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేసింది. ప్రతి నెల ఒకటో తేదీ నుంచి నెలపాటు జీతాలు ఇస్తున్నారు.. ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబాల్లో మనశ్శాంతి లేకుండా పోయింది. సర్కారుకు బుద్ధి చెప్పాలంటే పశ్చిమ రాయలసీమ టీడీపీ పట్టభద్రుల అభ్యర్థి రాంగోపాల్ రెడ్డికి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేయాలని కోరుతున్నాను. - మునయ్య, ఉమ్మడి ఏపీ ఎన్జీవో, రెవెన్యూ ఉద్యోగుల సంఘాల మాజీ ఉపాధ్యక్షుడు
ఇవీ చదవండి :