Chandrababu met CEC in Delhi about Irregularities of Votes: రాష్ట్రంలో ఓట్ల అక్రమాలపై హైలెవెల్ కమిటీ వేయాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఇవాళ దిల్లీలో సీఈసీ (Chief Election Commissioner)ని కలిసిన చంద్రబాబు.. రాష్ట్రంలో జరుగుతున్న ఓట్ల అక్రమాలను వివరించారు. ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇతర రాష్ట్రాల ఐఏఎస్‌లను పంపి పరిశీలించాలని కోరారు. అనంతరం మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ ఓట్లు, ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని, అక్రమాలకు పాల్పడిన అధికారులను జైలుకు పంపే అధికారం ఈసీకి ఉందని తెలిపారు. చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ నేతల బృందం సీఈసీతో చర్చలు జరుపుతున్న సమయంలోనే వైసీపీ ఎంపీలు సైతం అక్కడకు చేరుకున్నారు. విజయసాయిరెడ్డి, పలువురు ఎంపీలు ఈసీ కార్యాలయానికి వచ్చారు.
తాము ఇచ్చిన వివరాలు వాస్తవమా..? వైసీపీ నేతలు ఇచ్చినవి వాస్తవమా తేలాలని చంద్రబాబు పేర్కొన్నారు. ఓట్ల అక్రమాలపై హైలెవెల్ కమిటీ వేయాలని కోరామని చెప్పారు. తమ అభ్యంతరాలు, తాము చెప్పిన వివరాలను ఈసీ (Election Commission of India) అధికారులు సానుకూలంగా విన్నారని వెల్లడించారు. రాష్ట్రంలో ఓట్ల అక్రమాలపై ఉన్నతస్థాయి కమిటీని నియమించాలని, సీఈసీ, ఇద్దరు కమిషనర్లను రాష్ట్రంలో పర్యటించాలని కోరామని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే పార్టీలను రద్దు చేసే అధికారం ఈసీకి ఉంది అని చంద్రబాబు వివరించారు.
Prathidwani: వివాదాస్పదంగా వాలంటీర్ వ్యవస్థ.. 'కలెక్టర్లకు సీఈసీ హెచ్చరిక'
కనిగిరిలో జీరో డోర్ నెంబర్ పేరుతో ఓట్లు చేర్చడంపై.. ఓటర్ల పేర్లు, డోర్ నెంబర్లు, గ్రామాల వివరాలను ఈసీకి అందజేశారు. ఓటర్ల వ్యక్తిగత డేటా వాలంటీర్లకు ఎందుకు? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఓటర్ల వ్యక్తిగత డేటా(voters Personal data) ను ప్రైవేట్ సంస్థలకు ఇస్తున్నారన్న చంద్రబాబు.. ఏపీలో జరుగుతున్న ఓట్ల అక్రమాలు దేశంలో ఎక్కడా లేవని అన్నారు. ఎన్నికల కమిషన్ అధికారులు ఏపీకి వచ్చి ఓట్ల అక్రమాలు పరిశీలించాలని, పూర్తిస్థాయి కమిటీ వేసి ఏపీలో ఓట్ల అక్రమాలపై దర్యాప్తు చేయాలని కోరారు. రాష్ట్రంలో ఓట్ల అక్రమాలను పూర్తిగా సరిదిద్దాలని, ఎన్నికలకు ముందే అన్నీ సరిచేయాలని ఈసీని కోరుతున్నాం అని స్పష్టం చేశారు.
వాలంటీర్లు, వైసీపీ కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతున్నారన్న చంద్రబాబు.. బీఎల్‌వోలు పరిశీలించకుండానే ఓట్లను తొలగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15 లక్షల ఓట్లలో అవకతవకలు జరిగాయని తెలిపారు. తమ హయాంలో ఎప్పుడూ ఇలాంటి (ఓట్ల గల్లంతు, జాబితాలో అక్రమాలు) చెత్త పనులు చేయలేదని చంద్రబాబు అన్నారు. టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని, ఓట్ల అక్రమాలపై ప్రశ్నించే వారిని కేసులతో వేధిస్తున్నారని ఈసీకి వివరించారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని వింత సమస్య వచ్చిందని, ఒక పార్టీ ఓట్లు తొలగించాలనే ఆలోచన గతంలో ఎవరికీ రాలేదని అన్నారు.
ఇప్పటివరకు రాష్ట్రంలో నాలుగైదు ఎన్నికలు జరిగాయన్న చంద్రబాబు.. నకిలీ ఎపిక్ కార్డులు ప్రింట్ చేస్తున్నారని, చర్యలు తీసుకోవాలని ఈసీని కోరినా పట్టించుకోవడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఓట్ల తొలగింపుపై కోర్టుకు కూడా వెళ్లామని గుర్తు చేస్తూ.. స్థానిక ఎన్నికల్లో అనేక అక్రమాలకు పాల్పడ్డారని వివరించారు. స్థానిక ఎన్నికల్లో బెదిరించి, భయపెట్టి అభ్యర్థులను విత్‌డ్రా చేయించారని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ (Graduate MLC) ఎన్నికల్లో నకిలీ డిగ్రీ ధ్రువపత్రాలతో ఓట్లు నమోదు చేశారని తెలిపారు. రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు అని మీడియా సమావేశంలో చంద్రబాబు మండిపడ్డారు.
దేశ రాజకీయాలకు దశ, దిశ నిర్దేశించిన వ్యక్తి.. ఎన్టీఆర్ అని చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ స్మారక నాణెం తీసుకురావడంపై అభినందిస్తూ.. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కోరారు.
Telugu Desam Party fire on stolen votes: తప్పుల తడకగా ఓటర్ల జాబితా.. భారీగా దొంగ ఓట్లు..!