తెదేపా నేతలపై అక్రమ కేసుల ద్వారా ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. కూల్చివేతలు, స్కీముల రద్దు, రైతుల ఆత్మహత్యలు, దళితులపై దాడులు, పేదల సంక్షేమంలో కోతలు, కరెంటు బిల్లుల పెంపు, మద్యం మాఫియా, ఇసుక దోపిడి, ఇళ్ల స్థలాల కుంభకోణం వంటి విషయాలపై చర్చ రాకుండా చేయాలన్న దుష్ట బుద్ధితోనే తెదేపా నాయకులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు.
పోరాటం అభినందనీయం
మంత్రుల దాడులను తట్టుకొంటూనే శాసనమండలిలో తెదేపా ఎమ్మెల్సీలు సాగించిన పోరాటం అభినందనీయమని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఆన్‌లైన్ ద్వారా తెదేపా శాసనసభాపక్ష సమావేశం నిర్వహించిన ఆయన... అనారోగ్యం, వృద్ధాప్యాన్ని సైతం లెక్క చేయకుండా ఎమ్మెల్సీలు సభకు హాజరయ్యారని కొనియాడారు. సెలెక్ట్ కమిటీకి పంపిన బిల్లులను మళ్లీ తెచ్చి, రూల్ 90 కింద చర్చించాలని కోరితే దాడులకు దిగారని ధ్వజమెత్తారు. బడ్జెట్ సమావేశాలా లేక రాజధాని తరలింపు సమావేశాలా అని నిలదీశారు. ద్రవ్య వినిమయ బిల్లును ఎవరు ఆపారనేది... సమావేశాల వీడియోలు, రికార్డులు చూస్తే బయటపడుతుందన్నారు. ఎమ్మెల్సీలు ఇదే పోరాట స్ఫూర్తిని భవిష్యత్తులో కూడా కొనసాగించాలని అన్నారు. మరోవైపు ద్రవ్య వినిమయ బిల్లు ఆగటం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారని శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు తెలిపారు.
దేశ సరిహద్దుల్లో చైనా ఉద్రిక్తతలు రెచ్చగొట్టడాన్ని ఖండిస్తూ కేంద్రం తీసుకునే చర్యలకు తెదేపా శాసనసభాపక్షం సంఘీభావం ప్రకటించింది. అమరులైన 20మంది సైనికులకు నివాళులు అర్పించింది.
ఇదీ చదవండి