విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కొవిడ్ కేంద్రంలో అగ్నిప్రమాద ఘటనపై గవర్నర్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. స్వర్ణ ప్యాలెస్ హోటల్, రమేష్ ఆసుపత్రి యాజమాన్యాల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని విజయవాడ సెంట్రల్ తహసీల్దార్ పి.జయశ్రీ ఫిర్యాదు ఇచ్చారు. ఆ మేరకు పోలీసులు ఐపీసీ 304 (2), 308 సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేశారు. ఆ అగ్ని ప్రమాదంలో 10మంది మరణించటంతో పాటు 20మంది గాయపడినట్లు తహసీల్దార్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇవాళ ఉదయం 5గంటల సమయంలో అగ్ని ప్రమాదం జరిగిందని... తాను అక్కడకు వెళ్లి వాస్తవ పరిస్థితులు గమనించగా... లోపాలు బయటపడ్డాయని వివరించారు. విద్యుత్ ఉపకరణాలు, వైరింగ్ పాడైపోయిందని...వాటిని మార్చేందుకు ఎక్కువ డబ్బు ఖర్చవుతుందని అలాగే ఉంచారని ఫిర్యాదులో వివరించారు. ప్రమాదానికి ఆస్కారం ఉందని తెలిసినా నిర్లక్ష్యంగా వ్యవహరించారని... అందువల్లే అగ్ని ప్రమాదం జరిగిందని అభిప్రాయపడ్డారు.
తహసీల్దార్ ఫిర్యాదు మేరకు గవర్నర్‌పేట పోలీసులు క్రైం నంబర్ 173/2020 గా కేసు నమోదు చేశారు. ఆసుపత్రి, హోటల్ యాజమాన్యాలను ఈ కేసులో బాధ్యులుగా చేశారు. విజయవాడ సౌత్ ఏసీపీ ఈ కేసుకు సంబంధించి విచారణ అధికారిగా వ్యవహరించనున్నారు.
ఇదీ చదవండి: కొవిడ్ కేర్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం.. 11కుచేరిన మృతుల సంఖ్య