గన్నవరం విమానాశ్రయం నుంచి సరకు రవాణా చేసేందుకు ప్రత్యేక కార్గో సర్వీసు ప్రారంభమైంది. గత రెండేళ్లుగా సరకు రవాణా సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ పూర్తిస్థాయి కార్గో సర్వీసులు ఇక్కడి నుంచి లేవు. నెలకు వంద నుంచి 150 టన్నుల వరకు ప్రస్తుతం సరకు రవాణా జరుగుతోంది. ప్రయాణికుల విమాన సర్వీసుల్లోనే ఈ సరకును తరలిస్తున్నారు. సరకు రవాణాకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని.. తాజాగా స్పైస్‌జెట్ విమానయాన సంస్థ స్పైస్ ఎక్స్‌ప్రెస్ పేరుతో కార్గో సర్వీసును ఆరంభించేందుకు ముందుకొచ్చింది.
ఈ సర్వీసును విమానాశ్రయ డైరెక్టర్ మధుసూధనరావు, శ్రీపా కార్గో లాజిస్టిక్ ఎండీ రామారావు, విమాశ్రయ కార్గో ఎండీ అబ్రహం లింకన్ ప్రారంభించారు. ముంబయి నుంచి ఉదయం 7.30కు ఈ విమానం గన్నవరం చేరుకుంటుంది. ఇక్కడి నుంచి కోల్‌కతాకు సరకు తీసుకుని వెళుతుంది. 30 టన్నుల సామర్థ్యం ఉన్న ఈ విమాన సర్వీసును తొలుత వారానికి మూడు రోజులు గన్నవరం నుంచి నడపనున్నారు.
విమానాశ్రయంలో రూ.5 కోట్లతో 2500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నూతన కార్గో భవనం తాజాగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఉన్న కార్గో భవనం భవిష్యత్తు అవసరాలకు చాలకపోవడంతో కొత్తగా నిర్మించేందుకు భారత విమానయాన శాఖ అనుమతులు ఇచ్చింది. దేశంలోని దిల్లీ, చెన్నై, హైదరాబాద్ నగరాలకు మాత్రమే ప్రస్తుతం సరకు రవాణా జరుగుతోంది. మరికొద్ది నెలల్లో దేశంలోని అన్ని ప్రాంతాలకు సరకును పంపించేందుకు సన్నద్ధమవుతున్నారు.
ఇదీ చదవండి: కృష్ణాజిల్లాలో ప్రారంభమైన రెండో విడత ఎన్నికల పోలింగ్