Bus Overturned on National Highway: విజయవాడ నుంచి ఓ ఆర్టీసీ బస్సు బయలుదేరింది. కొంతసేపటికి ఏమైందో ఏమో కానీ.. బస్సులో ఏదో సమస్య ఉన్నట్లు ప్రయాణికులకు అనిపించింది. కాసేపటికి ఏసీ ఆగిపోయింది. ఇలా కొంత దూరం వెళ్లిన తరువాత లైట్లు కూడా ఆగిపోవడంతో ప్రయాణికులు భయపడి.. ఇదే విషయాన్ని డ్రైవర్‌కు చెప్పారు. అప్పటికే ఆ విషయం తెలిసిన ఆయన.. మెకానిక్కు సమాచారం ఇచ్చాను. కొంత దూరం పోయిన తరువాత బస్సు ఆపుతాను అన్నారు. కానీ ఈ లోపే బస్సు.. బోల్తా పడింది.
అసలు ఏం జరిగిందంటే: విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై చిల్లకల్లు టోల్ గేట్ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి ఆర్టీసీ గరుడ బస్సు బోల్తా పడింది. 27 మంది ప్రయాణికులతో విజయవాడ నుంచి హైదరాబాద్ వెళుతుండగా ఒక్కసారిగా బస్సు బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న 11 మందికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను జగ్గయ్యపేట ఆసుపత్రికి తరలించారు.
గాయాలు కాని వారిని ఇతర వాహనాల్లో హైదరాబాద్‌కు పంపారు. స్వల్పంగా గాయపడిన వారు ప్రథమ చికిత్స తీసుకని ఇతర ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లారు. పోలీసులు క్రేన్ సాయంతో బస్సును రోడ్డుపై నిలిపారు. విజయవాడ నుంచి బస్సు బయలు దేరిన తర్వాత బస్సులో స్వల్పంగా సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. నందిగామ వరకు రాగానే బస్సులో ఏసీ ఆగిపోవడం, హెడ్ లైట్ల సమస్య తలెత్తింది.
ఈ విషయమై ప్రయాణికులు డ్రైవర్‌కు చెప్పారు. జగ్గయ్యపేట వద్ద మెకానిక్ వస్తున్నాడని డ్రైవర్ వారికి తెలిపారు. చిల్లకల్లు టోల్ గేట్ దాటిన తర్వాత సుమారు 400 మీటర్ల దూరంలో బస్సు ఒక్కసారిగా బోల్తా కొట్టింది. బస్సులో టెక్నికల్ సమస్యలు తలెత్తడం వల్లే స్టీరింగ్ సైతం ఆగిపోయి ఉంటుందని, అందుకే బస్సు బోల్తా పడి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జగ్గయ్యపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో సగం మంది ఇతర ఆస్పత్రికి వెళ్లిపోగా నలుగురు అక్కడే చికిత్స పొందుతున్నారు. బస్సు ప్రమాద కారణాలపై పోలీసులు, ఆర్టీసీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: