ఏపీలో వైకాపా ప్రభుత్వం పోలీసుల సాయంతో కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని, భాజపా కార్యకర్తలను ఇబ్బంది పెడుతోందని కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని వైకాపా గుర్తుంచుకోవాలన్నారు. ప్రజలను దృష్టిలో పెట్టుకునే పాలకులు నిర్ణయాలు తీసుకోవాలని హితవు పలికారు. వ్యక్తులు, కుటుంబాల చుట్టూ తిరిగే పార్టీలు దేశానికి మేలు చేయలేవన్నారు. గురువారం విజయవాడలో జరిగిన ‘జన ఆశీర్వాద యాత్ర’ సభలోనూ, అంతకు ముందు తిరుపతిలో విలేకరులతోనూ కిషన్‌రెడ్డి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కిలో బియ్యంపై రూ.37 రాయితీ భరించి రూ.3కే దేశమంతా ఇస్తోందన్నారు. వైకాపా ప్రభుత్వం దీనిపై రెండు రూపాయల రాయితీ ఇచ్చి, కిలో బియ్యం రూపాయికి వారే ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం అన్ని విషయాల్లో అండగా నిలిచిందని, భవిష్యత్తులోనూ ఇతోధికంగా సాయం చేస్తుందని చెప్పారు. కానీ కొందరు పని గట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. జల వివాదాలను తెలుగు రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని, ఏ రాష్ట్రమూ నష్టపోకూడదన్నదే ప్రధాని మోదీ ఉద్దేశమని తెలిపారు.
కేంద్రం చొరవతోనే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ఆయిల్‌పామ్ రైతులకు మేలు జరిగిందని, నరేగా ద్వారా రాష్ట్రానికి భారీగా నిధులిస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు మినహా రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని కిషన్‌రెడ్డి విమర్శించారు. కనీసం రైతుల కోసం ప్రవేశపెట్టిన బిందుసేద్యం పథకానికీ తన వాటా నిధులివ్వకుండా పక్కన పెట్టేసిందని విమర్శించారు. ‘స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా ప్రధాని కేంద్ర మంత్రివర్గంలోకి పెద్ద ఎత్తున ఎస్సీ, ఎస్టీ, బీసీలను తీసుకున్నారు. వీరిని పార్లమెంటుకు పరిచయం చేస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుకోవడం దుర్మార్గం. అందుకే జన ఆశీర్వాద యాత్ర పేరుతో ప్రజల్లోకి వచ్చాం. వచ్చే జనవరి నుంచి డిసెంబరు వరకు దేఖో అప్నా దేశ్ పేరుతో పర్యాటక రంగ అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం. పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడానికి ఆర్థిక ప్యాకేజీని అమలు చేస్తాం. అఫ్గానిస్థాన్‌లోని భారతీయులను తీసుకురావడానికి చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు.
టీకా తయారీలో మనమే ముందు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాలవల్లే అభివృద్ధి చెందిన దేశాలకంటే ముందుగానే మనమే టీకాను తయారు చేసి, కుగ్రామాలకు సైతం చేరవేయగలిగామని కిషన్‌రెడ్డి చెప్పారు. హైదరాబాద్‌లో భారత్ బయోటెక్ సంస్థను ప్రధాని ప్రత్యేకంగా సందర్శించి యాజమాన్యాన్ని ప్రోత్సహించారని చెప్పారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్, పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ మాధవ్, నేతలు పాల్గొన్నారు.
కిషన్‌రెడ్డికి స్వల్ప గాయం
విజయవాడ సభలో పాల్గొని తిరిగి వెళ్తున్న కిషన్‌రెడ్డి కారు ఎక్కుతుండగా డోరు తగిలి నుదుటి మీద స్వల్ప గాయమైంది. ఆయన మాత్రలు వేసుకుని పర్యటన కొనసాగించారు.
శ్రీవారిని దర్శించుకున్న కిషన్‌రెడ్డి
తిరుమల, న్యూస్‌టుడే: కేంద్ర మంత్రి హోదాలో కిషన్‌రెడ్డి గురువారం ఉదయం కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి ఆయనను సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కరోనా మూడో దశ రాకుండా చూడాలని స్వామిని వేడుకున్నానన్నారు. అనంతరం తిరుపతి స్విమ్స్‌లో కరోనా టీకా కేంద్రాన్ని సందర్శించారు. కపిలతీర్థంలోని అమర జవాన్ల స్తూపం వద్ద నివాళులర్పించి, యుద్ధవీరుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: