ప్రధాని నరేంద్రమోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నానిని బర్తరఫ్ చేయాలని భాజపా నేతలు డిమాండ్ చేశారు. మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా సబ్‌కలెక్టరేట్‌ల ముట్టడికి భాజపా నేతలు పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా విజయవాడలో సబ్‌కలెక్టరేట్ వద్దకు వచ్చిన భాజపా కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. భాజపా రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డిని నక్కల్ రోడ్డులోని పార్టీ కార్యాలయంలోనే అడ్డుకున్నారు. కార్యాలయానికి ఇరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేసి పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యాలయం నుంచి సబ్‌కలెక్టరేట్‌కు వెళ్లేందుకు ప్రయత్నించిన విష్ణువర్థన్ రెడ్డి, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. నాయకులను అరెస్ట్ చేసే క్రమంలో పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
విశాఖలో..
హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతుంటే.. ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని.. భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. హిందూ మతాన్ని, ప్రధాని నరేంద్ర మోదీని కించపరుస్తూ మాట్లాడిన మంత్రి కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలంటూ.. తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్, విష్ణు కుమార్ రాజుకి వినతి పత్రం అందజేశారు.
ఇదీ చదవండి: రాష్ట్రవ్యాప్తంగా భాజపా నేతల గృహ నిర్బంధం