తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమై తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. రాష్ట్రంలో తెదేపా కార్యకర్తలు, నేతలపై జరుగుతున్న దాడులకు ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు. అభివృద్ధిని వదిలేసి రాజకీయపరమైన ఆధిపత్యం కోసం హింసాత్మక నేరాలకు పాల్పడటం వైకాపా నేతల దిగజారుడుతనానికి నిదర్శనమని చంద్రబాబు ఆక్షేపించారు. జైలు గోడల మధ్య కూడా హత్యలు చేయించిన చరిత్ర వైఎస్ కుటుంబానిదని మండిపడ్డారు. మాచర్లలో తమ పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా నిర్బంధించారని ధ్వజమెత్తారు.
సీఎం బాధ్యత వహించాలి
రాష్ట్రంలో తెదేపా కార్యకర్తలపై జరుగుతోన్న దాడులకు ముఖ్యమంత్రి జగన్ బాధ్యత వహించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గంగలగుంట గ్రామంలో తెదేపా కార్యకర్తలు పార్టీ మారలేదన్న కక్షతో మాచర్ల రూరల్ ఇన్‌స్పెక్టర్ వారిని 12 రోజులు నిర్బంధించి భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు. రాష్ట్రాన్ని రావణకాష్టంగా మారిస్తే సహించేది లేదని హెచ్చరించారు. తెదేపా శ్రేణులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద పెడుతున్న కేసులన్నీ అక్రమేనన్న ఆయన... సామాజిక మాధ్యమ వాలంటీర్లపై వేధింపుల గురించి న్యాయవాద విభాగంతో సమీక్షించారు. చట్టాల ఉల్లంఘనపై ప్రజల తరఫున పోరాటానికి సిద్ధమని ప్రకటించారు.
గాంధీ ఆశయాలే పార్టీ సిద్ధాంతాలు
స్వాతంత్య్ర సమరయోధుడు మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలను పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించాలని ఆయా శ్రేణులను చంద్రబాబు ఆదేశించారు. అహింస ద్వారానే మానవ సమాజం హింస నుంచి బయటపడుతుందని చెప్పిన మహనీయుడు గాంధీ అని కొనియాడారు. అందరికీ ఉపాధి, నివాసం, విద్య, ఆరోగ్యం ఉండాలన్న గాంధీ ఆశయాలే తెదేపా పార్టీ సిద్ధాంతాలన్నారు. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు సూచించారు.
ఇదీ చూడండి: