కృష్ణాజిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈనెల 17న జరిగిన హత్యాయత్నం కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు అవనిగడ్డ డీఎస్పీ మహబూబ్ బాషా తెలిపారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని ఆయన వెల్లడించారు. మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో ఒకపక్క మూడో విడత ఎన్నికలు జరుగుతుండగా సాయంత్రం సమయంలో ఓ వ్యక్తిపై కొంతమంది దుండగులు దాడి చేయడంతో ఒక్కసారిగా పోలీసులు ఉలిక్కిపడ్డారు.
లక్ష్మీపురం గ్రామంలో మహిళతో వివాహేతర సంబంధం కారణంగానే హత్యాయత్నం జరిగినట్టు డీఎస్పీ తెలిపారు. వివాహితతో కాకి శ్రీను అనే వ్యక్తికి, కాండ్రు సుమంత్ అనే మరోవ్యక్తికి గొడవలు జరిగాయి. అవి కాస్తా తీవ్రస్థాయికి చేరుకోవడంతో ఈ నెల 17న మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసి వస్తున్న అతనిపై కొందరు కత్తులతో దాడి చేశారు. శ్రీను చనిపోయాడని భావించిన వారు.. సంఘటన స్థలం నుంచి పారిపోయారు. తీవ్ర గాయలైన శ్రీను ప్రస్తుతం మచిలీపట్నం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
తాజాగా ఈ కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్యాయత్నంలో 8 మంది పాలు పంచుకున్నారని.. ఏడుగురు నిందితులను అరెస్టు చేశామని తెలిపారు. ఇంకొకరి కోసం రెండు బృందాలు గాలిస్తున్నాయని డీఎస్పీ చెప్పారు. నిందితులు ఉపయోగించిన రెండు మోటార్ సైకిళ్లు, సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదీ చదవండి: