ఈఎస్‌ఐ ఆస్పత్రులు, డిస్పెన్సరీలు, డయాగ్నోస్టిక్ కేంద్రాలకు ఒక్క మాత్ర గానీ, ఇంజెక్షన్ గానీ నామినేషన్ పద్ధతిలో కొనమని చేప్పలేదని మాజీమంత్రి అచ్చెన్నాయిడు ఈ ఏడాది ఫిబ్రవరి 21న స్పష్టం చేశారు. కార్మిక శాఖ మంత్రి హోదాలో తానెప్పుడూ సిఫారసు చేయలేదని, ఆదేశించనూ లేదని పేర్కొన్నారు. ఈఎస్‌ఐ మందులు, వైద్య పరికరాల కొనుగోలులో తన ప్రమేయం ఏమీ లేదని, తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని తెలిపారు. ఈఎస్‌ఐ కుంభకోణంపై విజిలెన్స్ నివేదిక బయటకొచ్చింది. అప్పటి కార్మిక శాఖ మంత్రి కనుసన్నల్లోనే కుంభకోణం జరిగిందని వైకాపా నాయకులు ఆరోపించడంతో... అదే రోజు ఆయన తన వివరణతో ఓ వీడియోను మీడియాకి విడుదల చేశారు.‘2017 ఏప్రిల్ వరకు కార్మికశాఖ మంత్రిగా ఉన్నానని... ప్రధాని నరేంద్ర మోదీ 2016లో ఈఎస్‌ఐపై సమావేశం ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. సాంకేతికత పెరిగింది కాబట్టి ప్రజలకు టెలీ హెల్త్ సర్వీసుల్నీ అందించాలని అన్ని రాష్ట్రాలకూ సూచించారని తెలిపారు. టెలీ హెల్త్ సర్వీసుల్ని వీలైనంత త్వరగా ప్రారంభించాలంటూ అన్ని రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయన్నారు. 2016 డిసెంబరులో అధికారులతో సమీక్షలో దీనిపై చర్చించామని... వాటిని మినిట్స్‌లో పొందుపరిచి, ఆమోదం తెలపాలని నిర్ణయించామని అన్నారు. ఆ తర్వాత అధికారులు నా దగ్గరకు వచ్చారని.... కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు టెలీ హెల్త్ సర్వీసెస్‌ని ప్రారంభించేందుకు ఏం చేయాలని చర్చ జరిగిందని తెలియజేశారు. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైనా చేస్తున్నారా? అని ప్రశ్నించానని... తెలంగాణలో చేస్తున్నారని అధికారులు చెప్పారని అన్నారు. అక్కడ ఎలా చేస్తున్నారో, ఇక్కడా అలాగే చేయండని మంత్రిగా నా శాఖకు ఒక నోట్ పంపానని స్పష్టం చేశారు. దాన్ని భూతద్దంలో చూపిస్తూ ఈఎస్‌ఐ మందులన్నీ నామినేషన్‌పై కొనాల్సిందిగా అచ్చెన్నాయుడు ఆదేశించారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని... నేనెప్పుడూ తప్పు చేయను. నాకు, నా కుటుంబానికి అవినీతి చరిత్ర లేదని తెలిపారు. కావాలంటే అప్పుడు నేనిచ్చిన లేఖను పరిశీలించుకోవచ్చని.. విచారణ కూడా చేసుకోవచ్చని వీడియోలో పేర్కొన్నారు. అప్పటి నోట్‌ఫైల్స్, ఫైల్స్ అన్నీ బైండింగ్ చేసి పెట్టానని. ఎక్కడా నామినేషన్ పద్ధతి మీద ఇవ్వడానికి వీల్లేదని, టెండర్లు పిలవాలని నేనే నోట్ పెట్టానని అని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి. మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు 14 రోజుల రిమాండ్