విజయవాడలో ప్రజా రవాణా వ్యవస్థలో కీలకం సిటీ బస్సులు. ఆరు డిపోల పరిధిలో నగరంలో మొత్తం 425 బస్సులు ఉన్నాయి. కరోనా కారణంగా ఆగిపోయిన వీటి కార్యకలాపాలు.. గత ఏడాది సెప్టెంబరు నుంచి ప్రారంభమయ్యాయి. గ్రామ సచివాలయ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని తిప్పడం మొదలుపెట్టారు. తర్వాత వీటిని కొనసాగించారు. గవర్నర్‌పేట-1, 2, ఇబ్రహీంపట్నం, విద్యాధరపురం, గన్నవరం, ఉయ్యూరు డిపోల పరిధిలో.. ప్రస్తుతం 385 బస్సులు నడుస్తున్నాయి. ప్రారంభంలో ఓఆర్(ఆన్లైన్ రిజిస్ట్రషన్) మరి తక్కువగా.. 18 నుంచి 20 శాతం మధ్య నమోదు అయ్యేది. ఇది మెరుగుపడి ప్రస్తుతం 50 శాతానికి చేరింది. తిరుగుతున్న సర్వీసుల్లో నగరంలో వాటి కంటే సబర్బన్ బస్సుల్లో ఓఆర్ మెరుగ్గా ఉంది.
నగరం నుంచి గన్నవరం, పామర్రు, కంకిపాడు, ఇబ్రహీంపట్నం, ఉయ్యూరు.. మార్గాల్లో ప్రయాణికుల సంఖ్య అధికంగా కనిపిస్తోంది. పరిసర ప్రాంతాల నుంచి విజయవాడ నగరానికి వివిధ పనులపై వచ్చే వారు ఎక్కువ కావడమే ఇందుకు కారణం. ఐదో నెంబరు రూట్‌లో 20 బస్సులు తిరుగుతున్నాయి. రైల్వేస్టేషన్ - పెనమలూరు మార్గంలో 10, జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీ - ఆటోనగర్ రూట్‌లో 12, మైలవరం - విజయవాడ రూట్‌లో 20, విజయవాడ - విస్సన్నపేట రూట్‌లో 16 నడుస్తున్నాయి. రాజధాని ప్రాంతానికి కూడా పూర్తిగా తిప్పుతున్నారు. విజయవాడ నుంచి అమరావతికి 15, హైకోర్టుకు 5, సచివాలయానికి 10 నడుస్తున్నాయి. ఇప్పటికే కళాశాలలు నడుస్తున్నాయి. ఆరో తరగతి నుంచి తరగతులు కూడా జరుగుతున్నాయి. పాఠశాలలు కూడా తెరుచుకోవడంతో బస్సు పాసులు కూడా ఇస్తున్నారు. వచ్చే నెల నుంచి ఐదో తరగతి లోపు వారికి కూడా తరగతులు మొదలవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మిగిలిన బస్సులను కూడా పునరుద్ధరించే అవకాశాలు ఉన్నాయి.
ఇదీ చదవండీ.. పల్లె పోరు: నేటి నుంచే నామినేషన్లు.. 9న ఎన్నికలు