APPSC Group-1 Mains in objective mode : గ్రూప్-1 ప్రధాన పరీక్షల్లో ఎంపిక చేసిన పేపర్లకు ఆబ్జెక్టివ్ విధానం అమలుపై సమాలోచనలు చేస్తున్నట్లు ఏపీపీఎస్సీ మంగళవారం ప్రకటించింది. నిజానికి ఈ పరీక్షలను డిస్క్రిప్టివ్ విధానంలో కాకుండా ఆబ్జెక్టివ్ పద్ధతిలో పెడితే వాటి నియామకాల లక్ష్యమే దెబ్బతింటుంది. యూపీఎస్సీ (UPSC), ఏపీపీఎస్సీ (APPSC) మధ్య ఉన్న అనుసంధానం తెగిపోతుంది. గ్రూప్-1 నోటిఫికేషన్(Group-1 Notification) కోసం ఎదురు చూస్తూ ప్రస్తుత విధానానికి అనుగుణంగా సన్నద్ధమవుతున్న అభ్యర్థులు నష్టపోయే ప్రమాదం ఉంది. సివిల్స్, గ్రూప్-1లకు ఉమ్మడిగా కాకుండా.. విడివిడిగా సన్నద్ధం కావాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. పెపైచ్చు... ఆబ్జెక్టివ్ విధానం అంటే... కాపీయింగ్‌కు అవకాశం ఉంటుంది. నాలుగైదు ప్రశ్నలకు సమాధానం తెలియకపోతే... అభ్యర్థులు నష్టపోయే ప్రమాదం ఉంది.
డిస్క్రిప్టివ్ విధానంలో అయితే రాసినంత మేర మార్కులు వస్తాయి. ఆబ్జెక్టివ్ విధానంలో అదృష్టం కూడా పనిచేస్తుంది. డిస్క్రిప్టివ్ విధానమైతే అభ్యర్థి ఎలా రాస్తున్నారు, సమయపాలన, విషయ అవగాహన, ఏకాగ్రత వంటి అంశాలనూ మూల్యాంకనం సమయంలో పరిగణనలోకి తీసుకుంటారు. ఆబ్జెక్టివ్ విధానం (Objective Method) లోనైతే అభ్యర్థుల సామర్థ్యాన్ని అంచనా వేయడం కష్టం. ప్రస్తుతం మహారాష్ట్రలో ఆబ్జెక్టివ్ విధానంలో గ్రూప్-1 ప్రధాన పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ విధానంలో ఉన్న లోపాలను పరిశీలించిన అక్కడి ప్రభుత్వం.. డిస్క్రిప్టివ్ పద్ధతిలో పరీక్షలు పెట్టాలని నిర్ణయించింది. కానీ, డిస్క్రిప్టివ్ పద్ధతిపై అభ్యర్థులు ఆందోళన చేయడంతో... ఆ విధానాన్ని 2025 వరకు వాయిదా వేసింది.
కోర్టు ధిక్కరణ కేసు.. హైకోర్టుకు హాజరైన మాజీ డీజీపీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి
ఆబ్జెక్టివ్ విధానంపై ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ (APPSC Chairman Gautam Sawang), సభ్యుడు సలాంబాబు మంగళవారం విలేకర్లతో మాట్లాడారు. సబ్జెక్టుల వారీగా జవాబుపత్రాల మూల్యాంకనానికి, ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి పేపర్లకు ప్రొఫెసర్ల కొరత వస్తోందని వారు చెప్పారు. మార్కుల కేటాయింపులో ప్రొఫెసర్ల వారీగా సారూప్యత ఉండట్లేదన్నారు. డబుల్ వాల్యుయేషన్ తర్వాత కూడా 15 శాతం పేపర్లు.., మూడో వాల్యుయేషన్‌కు వస్తున్నాయని తెలిపారు. అందుకే గ్రూప్-1 ప్రధాన పరీక్షల్లో రెండు లేదా మూడు పేపర్లను ఆబ్జెక్టివ్ విధానంలో ఇస్తే ఎలా ఉంటుందన్న దానిపై ఆలోచన చేస్తున్నామని వివరించారు. 50 శాతం ప్రశ్నలను వ్యాసరూపం, మిగిలిన 50 శాతం ప్రశ్నలను ఆబ్జెక్టివ్ విధానంలో ఇచ్చే విషయాన్నీ పరిశీలిస్తున్నామని చెప్పారు. యూపీఎస్సీ పేపర్ల మూల్యాంకనానికి ప్రొఫెసర్లు జాతీయస్థాయిలో అందుబాటులో ఉంటారని... రాష్ట్రాల్లో ఈ విషయంలో ఇబ్బంది ఉంటుందని పేర్కొన్నారు. రైల్వే (Railway), నాబార్డు (NABARD) నియామకాల్లో ఈ విధానం ఇప్పటికే ఉందని ప్రస్తావించారు. వచ్చే నెలాఖరు నాటికి గ్రూప్-1 నోటిఫికేషన్ ఇస్తామని ఏపీపీఎస్సీ ప్రకటించింది. కమిషన్ ప్రతిపాదించిన మార్పులు చేర్పులపై అభ్యర్థులు, తల్లిదండ్రులు, మేధావులు రెండు వారాల్లోగా అభిప్రాయాలు తెలియజేస్తే పరిశీలిస్తామన్నారు.
Group 1 Mains Results: గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల.. ఇంటర్వ్యూలు ఎప్పుడంటే