2020-21 విద్యా సంవత్సరానికి రుసుములను సమీక్షించి నిర్ణయించేందుకు పూర్తి వివరాలు సమర్పించాలని ప్రైవేట్, ఆన్ ఎయిడెడ్ పాఠశాలన్ని కోరుతూ ఏపీ పాఠశాల విద్య నియంత్రణ పర్యవేక్షణ కమీషన్ (ఏపీఎస్ఈఆర్ఎంసీ ) కార్యదర్శి జారీ చేసిన నోటిఫికేషన్ అమలును హైకోర్టు ఈ నెల 26 వరకు సస్పెండ్ చేస్తూ అదే రోజుకు వాయిదా వేసింది. మే 26న జారీ చేసిన నోటిఫికేషన్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొన్ని పాఠశాలల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి.
ఈ వ్యాజ్యాలపై విచారణ చేపట్టిన కోర్టు కౌంటర్లు దాఖలుచేయాలని ప్రభుత్వాన్ని కమిషన్‌ను ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. లలిత మంగళవారం ఈ మేరకు మద్యంతర ఉత్తర్వులిచ్చారు. పిటషనర్ల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఉపాధ్యాయుల వ్యక్తిగత వివరాలు కోరడానికి వీల్లేదు. పాఠశాలలు సెలవుల్లో ఉన్నప్పుడు వివరాలు కోరడం సరికాదు. హడవుడిగా రుసుమును ఖరారు చేయటం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్దం. రుసుములు నియంత్రణ ప్రక్రియ విద్యా సంవత్సరం ప్రారంభానికి ఆర్నెళ్ల ముందే ప్రారంభించాల్సి ఉందన్నారు. ఇదే విషయమై ఇటీవల ఓ పాఠశాల హైకోర్టును ఆశ్రయించగా నోటిఫికేషన్ అమలును తాత్కలికంగా నిలుపుదల చేశారని గుర్తుచేశారు.
ఇవీ చదవండి