CM lies in the name of farmer assurance: రైతు భరోసా పేరుతో సీఎం జగన్ చెప్పేవన్నీ అబద్దాలేనని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర మండిపడ్డారు. రైతులకు వేల కోట్ల సాయం చేశామంటూ ఇచ్చిన ప్రకటనలన్నీ మోసమని ధ్వజమెత్తారు. రైతుల ఆత్మహత్యల్లో దేశంలో రాష్ట్రం 3వ స్థానంలో వుందని.., ఇప్పటివరకు 3 వేలమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడటం గర్హనీయమన్నారు.
ధరల స్థిరీకరణనిధి అమలెక్కడ?..: ఎన్నికల ముందు ధరల స్థిరీకరణ నిధి హామీ ఇచ్చిన జగన్.., ఎంతమందికి ఇచ్చాడని కొల్లు రవీంద్ర నిలదీశారు. ధాన్యం కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నాడని ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లకు లేనిపోని షరతులు పెట్టి రైతులను రోడ్డున పడేసారని దుయ్యబట్టారు. ఏ పంటకు మద్దతు ధర లభించడం లేదన్నారు. ధాన్యం సేకరణను 37 లక్షల టన్నులకు కుదించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మరిన్ని అప్పుల కోసం మోటార్లకు మీటర్లు పెట్టి రైతు మెడకు ఉరి బిగిస్తున్నారని మండిపడ్డారు.
ఆక్వాలో కూడా హాలిడేనా..: ఆక్వా రంగానికి.. ఎన్నికల ముందు కరెంట్ యూనిట్ 1.50 పైసలకు ఇస్తానన్న జగన్.. అధికారంలోకి వచ్చిన తరువాత 5.50 పైసలు చేసాడని కొల్లు రవీంద్ర దుయ్యబట్టారు. ఆక్వా జోన్లు అని రైతులను నిలువునా ముంచారని ధ్వజమెత్తారు. వ్యవసాయంలో క్రాప్ హాలిడే మాదిరిగా, ఆక్వాలో కూడా హాలిడే ప్రకటిస్తున్నారని పేర్కొన్నారు.
రైతుల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం..: ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి ఆక్షేపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మాయమాటలు చెప్పకుండా నిజాయతీతో రైతులకు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ప్రకటనలు కాకుండా రైతులకు చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తెలుగుదేశం పార్టీ రైతుల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని తేల్చిచెప్పారు.
ఇవీ చదవండి