అనధికారికంగా విద్యుదుత్పత్తి చేయకూడదనే విషయాన్ని కృష్ణాబోర్డు సమావేశంలో చెప్పామని రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు తెలిపారు(krishna river management board news). ఏపీకి విద్యుదుత్పత్తి అధికారం ఇవ్వాలని కోరామని.. ప్రోటోకాల్ ప్రకారం విద్యుదుత్పత్తి చేయాలని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. ఎవరైనా నిబంధనల మేరకే విద్యుదుత్పత్తి చేయాలని స్పష్టం చేశామన్నారు. సాగర్, శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్టుల గురించి బోర్డు ఛైర్మన్ చర్చించారని పేర్కొన్నారు. అన్ని ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని బోర్డు దృష్టికి తీసుకెళ్లామని వివరించారు.
'అనధికారికంగా విద్యుదుత్పత్తి చేయకూడదని చెప్పాం. విద్యుదుత్పత్తి అధికారం ఇవ్వాలని కోరాం. ఎవరైనా నిబంధనల మేరకే విద్యుదుత్పత్తి చేయాలి. సాగర్, శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్టుల గురించి బోర్డు ఛైర్మన్ చర్చించారు. అన్ని ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం' - శ్యామలరావు, రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి
తెలంగాణ వాదన ఇలా..
కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు జరిగి.. వాటా కేటాయించే వరకు గెజిట్ నోటిఫికేషన్ ఆపాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును(KRMB Meeting news) సమావేశంలో కోరామని తెలంగాణ నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ వెల్లడించారు. కృష్ణా యాజమాన్య బోర్డు సమావేశానికి హాజరైన రజత్‌కుమార్.. రాష్ట్ర అభ్యంతరాలు తెలిపామన్నారు. కృష్ణా పరిధిలో 65 కేంద్రాలు గెజిట్ నోటిఫికేషన్‌లో ఉన్నాయని వివరించారు. నాగార్జునసాగర్‌పై 18, శ్రీశైలంపై 12 కేంద్రాలు ఇవ్వాలని బోర్డు ప్రతిపాదించిందని వెల్లడించారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు బోర్డు పరిధిలోకి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ కోరిందని.. తాము అభ్యంతరం చెప్పామని తెలిపారు. ప్రాజెక్టు యాజమాన్య హక్కుల విషయమై న్యాయసలహా ఆడిగామన్నారు.
కొత్త నిర్ణయాలు తీసుకోలేదు..
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(KRMB Meeting news) సమావేశంలో కొత్తగా ఏ నిర్ణయాలు తీసుకోలేదని రజత్‌కుమార్(Rajat Kumar Comments) తెలిపారు. విద్యుదుత్పత్తికి అనుమతి ఇవ్వాలని ఏపీ అడుగుతోందని వెల్లడించారు. ఈ నెల 14లోగా స్పష్టమైన నిర్ణయం వెల్లడిస్తామని పేర్కొన్నారు. త్వరలో కేంద్రానికి, ఏపీకి తమ నిర్ణయాన్ని చెబుతామని స్పష్టం చేశారు. ప్రాజెక్టులకు రుణాల గురించి ఏమీ చర్చించలేదని రజత్‌కుమార్ అన్నారు. శ్రీశైలంలో నిబంధనల ప్రకారమే విద్యుదుత్పత్తి చేస్తున్నామని వెల్లడించారు.
ఇదీ చదవండి