తెదేపా అధినేత, నాటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు బాధ్యతలను ఐపీఎస్ అధికారి ఎస్.వి. రాజశేఖర్‌బాబుకు ప్రభుత్వం అప్పగించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి ఏపీ ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సహా పలువురిపై ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల పరిధిలో నమోదైన కేసుల దర్యాప్తునకు 2015లో నాటి తెదేపా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ అధిపతిగా శాంతిభద్రతల విభాగం డీఐజీ రాజశేఖర్‌బాబును నియమించింది. అప్పట్లో ఈ సిట్ చీఫ్‌గా వ్యవహరించిన మహ్మద్ ఇక్బాల్ పదవీ విరమణ చేయటంతో ఆ బాధ్యతలను రాజశేఖర్‌బాబుకు అప్పగించింది. డీజీపీ గౌతమ్ సవాంగ్ నుంచి గత నెల 3న అందిన ప్రతిపాదనల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా కేసులు...
ఓటుకు నోటు కేసు నేపథ్యంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, అప్పటి ఏపీ మంత్రులు, ఇతరుల ఫోన్ల ట్యాపింగ్, సంభాషణల నమోదుకు తెలంగాణ ప్రభుత్వం పాల్పడిందని ఆరోపిస్తూ కేసీఆర్, జగన్, అప్పటి తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్, తెలంగాణ ఏసీబీ అధికారులు, సాక్షి, టీ న్యూస్ ఛానెళ్లపై ఏపీలోని వివిధ ప్రాంతాల్లో తెదేపా శ్రేణులు ఫిర్యాదులు చేశారు. వీటి ఆధారంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మొత్తం 88 కేసులు నమోదయ్యాయి. వీటి దర్యాప్తు కోసం మహ్మద్ ఇక్బాల్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేస్తూ 2015 జూన్ 17న ఉత్తర్వులిచ్చారు. ఆయన పదవీ విరమణ చేయటంతో ఈ కేసులన్నింటికీ తార్కిక ముగింపు తీసుకొచ్చేందుకు ఆ స్థానంలో రాజశేఖర్‌బాబును నియమించింది. అయితే ఇక్బాల్ 2018లోనే పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం వైకాపా ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇన్నాళ్ల తర్వాత సిట్ అధిపతిగా మరొకరికి బాధ్యతలు అప్పగించటం ప్రాధాన్యం సంతరించుకుంది.