రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్య 10 లక్షలు దాటింది. ఆదివారం ఉదయం 9 గంటల వరకు 10,17,123 మందికి కొవిడ్ పరీక్షలు చేసినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా పరీక్షల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉన్నట్లు తెలిపింది. జాతీయ స్థాయిలో ప్రతి పది లక్షల మంది (మిలియన్) కి 6,578 మందికి పరీక్షలు చేయగా... రాష్ట్రంలో 19,047 మందికి పరీక్షలు చేసినట్లు పేర్కొంది.
మరణాల రేటు కూడా తక్కువే..
మరణాల రేటు కూడా ఏపీలోనే తక్కువని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో కొవిడ్ మరణాల రేటు 1.24 శాతంగా ఉంటే.. జాతీయస్థాయిలో 2.86 శాతమని వెల్లడించింది. పొరుగు రాష్ట్రం తెలంగాణలో మరణాల రేటు 1.29 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో తొలి శాంపిల్‌ను ఫిబ్రవరి 1న హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి వైద్యులు పంపారు. మార్చి 7న తిరుపతి స్విమ్స్‌లో తొలి కొవిడ్ పరీక్ష జరిగింది.
ప్రస్తుతం యాక్టివ్ కేసులు 10043
మరో వైపు ఆదివారం ఉదయం 9 గంటలు నాటికి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 18,697కి చేరింది. మొత్తం 232 మంది వైరస్ బారిన పడి మరణించారు. 8422 మంది కోలుకొని డిశ్చార్జి కావటంతో రాష్ట్రంలో 10043 యాక్టివ్ కేసులు ఉన్నాయి.