థర్మల్ ప్లాంట్లకు బొగ్గు కొరత రాకుండా చూడాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితులు, బొగ్గు సరఫరా, విద్యుత్‌పై ప్రణాళిక, దీర్ఘకాలిక వ్యూహాలపై సమీక్షించారు(cm jagan review on power crisis news). ఎలాంటి అవాంతరాలు లేకుండా నిరంతరంగా కరెంటును సరఫరా చేస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను బేరీజు వేసుకుని ఆ మేరకు తగిన చర్యలతో ముందుకు వెళ్తున్నామని అధికారులు తెలిపారు. మహానది కోల్‌ఫీల్డ్స్ నుంచి 2 ర్యాకుల బొగ్గు అదనంగా వచ్చిందని తెలిపిన అధికారులు.. రాష్ట్రంలో జెన్‌కో ఆధ్వర్యంలో థర్మల్‌విద్యుత్ ఉత్పత్తిని 50 మిలియన్ యూనిట్ల నుంచి 69 మిలియన్ యూనిట్లకు పెంచామని తెలిపారు.
కొరత రావొద్దు..
థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత రాకుండా చూసుకోవాలని సీఎం జగన్(cm jagan news) అధికారులను ఆదేశించారు. సింగరేణి సహా కోల్ ఇండియా తదితర సంస్థలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలన్నారు. బొగ్గు తెప్పించుకునేందుకు సరుకు రవాణా షిప్పుల వినియోగం లాంటి ప్రత్యామ్నాయాలపై కూడా ఆలోచనలు చేయాలన్నారు. ఫలితంగా రవాణా ఖర్చులు కలిసి వస్తాయని సీఎం సూచించారు. ఇందుకోసం సంబంధిత కేంద్ర ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసుకోవాలన్నారు.
ఉత్పత్తి వ్యూహాలపై దృష్టి సారించాలి..
పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్ నుంచి 170 మెగావాట్ల విద్యుత్ కూడా అందుబాటులోకి వస్తోందని అధికారులు సీఎంకు తెలిపారు. కావాల్సిన విద్యుత్‌ను సమీకరించుకోవాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. తాత్కాలిక చర్యలతో పాటు దీర్ఘకాలిక విద్యుత్ ఉత్పత్తి వ్యూహాలపైనా దృష్టి సారించాలన్నారు. 6300 మెగావాట్ల రివర్స్ పంపింగ్ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు నిర్మాణంపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సీలేరులో ప్రతిపాదిత 1350 మెగావాట్ల రివర్స్ పంపింగ్ ప్రాజెక్టుపైనా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ ప్రాజెక్టులను సాకారం చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.
'విద్యుత్ కొరత విషయంలో సింగరేణి, కోల్‌ఇండియాతో సమన్వయం చేసుకోవాలి. బొగ్గు తీసుకువచ్చే రవాణా ఓడలపై దృష్టి పెట్టండి. థర్మల్ ప్లాంట్లకు బొగ్గు కొరత రాకుండా చూడాలి. కావాల్సిన విద్యుత్ సమీకరించుకోవాలి. దీర్ఘకాలిక విద్యుదుత్పత్తి వ్యూహాలపైనా దృష్టి పెట్టండి. 6,300 మెగావాట్ల రివర్స్ పంపింగ్ ప్రాజెక్టు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలి. సీలేరులో 1,350 మెగావాట్లు రివర్స్ పంపింగ్ ప్రాజెక్టుపై దృష్టిసారించాలి' - ముఖ్యమంత్రి జగన్
ఇదీ చదవండి:
BALAKRISHNA: 'వైకాపాకు సొంత ఖజానా నింపుకోవాలనే ఆరాటమే.. అభివృద్ధి పట్టడం లేదు'