ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై ఏం జరుగుతుందోనని రాష్ట్ర ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారని వైకాపా ఎంపీ రఘురామకృష్ణ అన్నారు. సీబీఐ కౌంటర్ ఫైల్ చేసినా చేయకపోయినా జులై 26న తుది ఉత్తర్వులిస్తారని న్యాయమూర్తి చెప్పినట్లు తమ న్యాయవాది తెలిపారని, అందువల్ల ఆ రోజు చాలా ముఖ్యమైనదని వ్యాఖ్యానించారు. న్యాయం జరుగుతుందనే అనుకుంటున్నానని అన్నారు. రఘురామకృష్ణరాజు దిల్లీలో బుధవారం విలేకర్లతో మాట్లాడారు. ‘8వ తేదీన జరిగిన విచారణలో తాము ఎటువంటి రాతపూర్వక పిటిషన్ ఇవ్వడం లేదని, మీరు సరైన నిర్ణయం తీసుకోండి అని సీబీఐ కోర్టుకు చెప్పింది. కౌంటర్ దాఖలుకు నిర్ణయం తీసుకున్నందున తమకు పది రోజుల గడువివ్వాలని తాజాగా మంగళవారం రాతపూర్వకంగా కోర్టును కోరింది. సీబీఐ రెండు రకాలుగా చెప్పడంపై మా న్యాయవాది వెంకటేష్ అభ్యంతరం చెప్పారు. కోర్టు సీబీఐకి పది రోజుల గడువిచ్చింది. జులై 26 విచారణకు ఆఖరి రోజని భావిస్తున్నా. బెయిల్ మంజూరుకు సీబీఐ ఎప్పుడూ వ్యతిరేకంగానే ఉంటుంది. 2018లో జగన్‌మోహన్ రెడ్డి ఓ విశ్రాంత ఐఏఎస్ అధికారిపై కామెంట్ చేస్తే బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోరింది. నాడు రవ్వంత దానికే స్పందించిన సీబీఐ ఇప్పుడు కొండంత అయినప్పుడు స్పందించదన్న అనుమానం నాకేమీ లేదు. ఏం జరుగుతుందో వేచి చూద్దాం. హిచ్‌కాక్ సినిమా కన్నా సస్పెన్స్‌గా ఉంది’ అన్నారు.
ఎంపీ భరత్ సినిమా ప్రజలు చూడలేదు
‘రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు పడుతుంది.. నర్సాపురం నియోజకవర్గ సమస్యలు సీఎం నన్ను చూసుకోమన్నారు’ అని రాజమండ్రి ఎంపీ భరత్ వ్యాఖ్యానించడంపై రఘురామకృష్ణరాజు స్పందించారు. సభాపతి నిర్ణయాలను తమ పార్టీ నాయకులే తీసుకుంటున్నారని తనకు తెలియదన్నారు. ‘భరత్‌ను స్వాగతిస్తున్నా. ఆయన ఓ సినిమాలో నటించారు. ప్రజలు దానిని చూడలేదు. విజయవంతం చేయలేదు. లేకపోతే ఓ మహా నాయకుడిని కోల్పోయేవారు. రాజమండ్రిలో ప్రజలు నివసించేందుకు ఆవ భూమిని ఎంపిక చేసి ముఖ్యమంత్రి మనసు దోచిన ఆయన అనేక నియోజకవర్గాలకు ఎదగాలని ఆశిస్తున్నా’ అని వ్యంగ్యంగా అన్నారు. తన అంశంలో సభను స్తంభింపజేస్తామనే వారు ఆ విద్యను ప్రత్యేక హోదా, పోలవరం నిధులు, రైల్వే జోన్‌పై ఎందుకు వినియోగించడం లేదని ప్రశ్నించారు. మీ కేసుల విచారణ 11 ఏళ్లుగా జరుగుతుంటే నా కేసుల విచారణ వెంటనే జరగాలనడమేమిటని ప్రశ్నించారు. తన అనర్హతపై వారి ఆశలు అడియాశలుగా మిగిలిపోతాయని, తన ఆశయం నెరవేరుతుందనే నమ్మకం తనకుందని చెప్పారు. వైకాపా పార్లమెంటరీ పార్టీ సమావేశానికి తనను ఆహ్వానించకపోవడంపై ముఖ్యమంత్రికి లేఖ రాస్తానన్నారు.
ఇదీ చూడండి:
JAGAN CBI CASE: జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై విచారణ వాయిదా