కృష్ణా జిల్లా జూపూడికి చెందిన పసుమర్తి సుబ్రమణ్యం దంపతులకు ముగ్గురు సంతానం. అనారోగ్యంతో ఇద్దరు పిల్లలు చిన్నప్పుడే మరణించారు. పిల్లల మృతితో తీవ్ర మానసిక వేదనకు గురైన ఈ దంపతులు బాధ నుంచి బయటపడేందుకు కుక్క పిల్లలను పెంచడం మొదలుపెట్టారు. 2001లో రత్న పేరుతో ఓ జంతు సంక్షేమ సేవా సంస్థను స్థాపించి... నోరులేని మూగజీవాలకు ఆహారం అందిస్తున్నారు. ఇంట్లో 30 కుక్కలను పెంచుతూనే రోడ్లపైనా, వీధుల్లో సంచరించే శునకాలకు అన్నం పెడుతున్నారు.
శునకాలకు సమాధి
ఇటుకల వ్యాపారం చేసే సుబ్రమణ్యానికి 19 ఏళ్లుగా ఇదే వ్యాపకం. తన ఆదాయం మొత్తాన్నీ వీటికే వెచ్చిస్తున్నాడు. లాక్‌డౌన్‌తో రెండు నెలలుగా ఆదాయం లేకున్నా... శునకాలకు ఆహారం అందించడం మాత్రం ఆపలేదు. ఎంతో ప్రేమగా చూసుకుంటున్న తన పెంపుడు కుక్క సన్నీ చనిపోతే... దానికి అంత్యక్రియలు చేసి.. సమాధి కూడా కట్టించారు.
కుక్కలకు ఆహారం
ఎండాకాలంలో రోడ్లపై తాగేందుకు నీరు లేక అలమటించే మూగ జీవాల కోసం అక్కడక్కడా నీటి తొట్టెలు ఏర్పాటు చేశారు. ప్రతి వారం వీధికుక్కలకు ఆహారం అందించడాన్ని తన జీవనశైలిగా మార్చుకున్నారు. రోడ్లపై కుక్కలకు తిండి పెట్టడంపై చుట్టుపక్కల వాళ్లు అభ్యంతరం చెప్పినా... సుబ్రమణ్యం అవేమీ పట్టించుకోరు. నిత్యం పలు ప్రాంతాల్లో తిరుగుతూ 300కు పైగా కుక్కలకు బిస్కెట్లు, పెరుగన్నం పెడుతూ జంతు ప్రేమను చాటుకుంటున్నారు.
సుబ్రమణ్యం వాహనం హారన్ వినిపిస్తే చాలు... ఆ ప్రాంతంలోని కుక్కలన్నీ తోక ఊపుకుంటూ బండి దగ్గరకు వచ్చేస్తాయి. లాక్‌డౌన్ ఉన్నన్ని రోజులు కుక్కలకు ఆహారం పెడతానని తర్వాత వారానికోసారి వీధి కుక్కలకు తిండిపెడతాననీ అంటున్నారాయన.
ఇవీ చదవండి: