పెడన నియోజకవర్గంలోని సెయింట్ విన్సెంట్ పాల్లోటి స్కూల్‌లో నిర్వహించిన అమ్మఒడి రెండో విడతను ఎమ్మెల్యే జోగి రమేశ్ ప్రారంభించారు. బాలలను విద్యావంతులుగా తీర్చిదిద్దడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని స్పష్టంచేశారు. విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు నాంది పలకడానికి ప్రవేశపెట్టిన పథకంగా కొనియాడారు.
పేదరికం కారణంగా ఏ తల్లి.. తన బిడ్డలను బడికి పంపలేని పరిస్థితి రాకూడదని రెండో ఏడాది అమ్మఒడి ద్వారా చెక్కులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని 22,615 మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుందన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, వైకాపా నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
విజయవాడ:
విజయవాడ వన్‌టౌన్ గాంధీజీ మున్సిపల్ హైస్కూల్లో అమ్మఒడి రెండో విడత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రావు పాల్గొని.. చెక్కులు పంపిణీ చేశారు. సంక్రాంతి పర్వదినం, అమ్మ ఒడి రెండో విడత డబ్బుల పంపిణీతో రాష్ట్రంలో సందడి నెలకొందన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా జగనన్న దృఢ సంకల్పం ముందు అవన్నీ దిగదుడుపేనని మంత్రి పేర్కొన్నారు.
నందిగామ:
నందిగామలో రెండోవిడత అమ్మఒడి పథకాన్ని శాసనసభ్యులు మొండితోక జగన్మోహన్రావు ఘనంగా ప్రారంభించారు. నిరుపేద తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తును మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఈ పథకం తోడ్పడుతుందని ఆయన అన్నారు. నాడు- నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా ఉన్నత ప్రమాణాలతో కూడిన ఉచిత విద్యను ప్రభుత్వం అందిస్తుందన్నారు.
జగనన్న విద్యా కానుక పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు ఉచితంగా స్కూల్ బ్యాగ్, యూనిఫామ్, బుక్స్ ,షూ ,టై, బెల్ట్ అందించామన్నారు. అంతేకాక మధ్యాహ్న భోజన పథకం 'గోరుముద్ద' ద్వారా రుచికరమైన ఆహారం అందిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలాధికారులు, ఉపాధ్యాయులు, వైకాపా నాయకులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కర్నూలులో రెండో విడత అమ్మఒడి ప్రారంభం