మూడు రాజధానుల అంశం మళ్లీ అసెంబ్లీలో తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో అమరావతి పరిరక్షణ సమితి కోర్ కమిటీ విజయవాడలో సమావేశం నిర్వహించింది. అమరావతి ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని రైతులు, జేఏసీ సభ్యులు, రాజకీయ పార్టీలు ప్రతిపాదించాయి. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి సీఎం జగన్ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలపై హైకోర్టు అనేక సార్లు చివాట్లు పెట్టినా.. వైకాపా ప్రభుత్వం తీరు మారడం లేదని జేఏసీ సభ్యులు మండిపడ్డారు.
సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల బిల్లు శాసనసభలో ఆమోదంపై కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని రైతుల జీవితాల్లో చీకటి నింపినందుకు.. ప్రతిరోజూ గ్రామాలలో గంటపాటు విద్యుత్ దీపాలు ఆపేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల సమయంలో విద్యుత్ దీపాలు ఆపేస్తామన్నారు. ముఖ్యమంత్రి ఇంటి నుంచి అసెంబ్లీకి వెళ్లే దారి మొత్తం నల్ల జెండాలను కట్టి నిరసన తెలుపుతామన్నారు. కరోనా కారణంగా 60 రోజుల నుంచి ఉద్యమం నెమ్మదించినా.. రేపట్నుంచి అమరావతి జేఏసీ మహిళలంతా కలిసి ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామన్నారు. 3 రాజధానుల నిర్ణయం ఉపసంహరించుకునేదాకా.. తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో మరో 351 కరోనా పాజిటివ్ కేసులు..ఇద్దరు మృతి