కరోనా ఆంక్షలు.. ఆ ప్రేమికులను అడ్డుకోలేకపోయాయి. నచ్చిన యువకుడితో ఏడడుగులు వేయాలన్న సంకల్ప బలం.. ఆ యువతితో ఆరు పదుల అడుగులు వేయించింది. రవాణా లేదు.. ఎవరి అండా లేదు. అయినా ఆమె లెక్క చేయలేదు. ఎలాగైనా.. తన ప్రేమికుడిని కలిసి.. మనువాడాలని నిశ్చయించుకుంది. అనుకున్నదే తడవుగా.. ఒంటరి ప్రయాణం ప్రారంభించింది. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ నుంచి మచిలీపట్నానికి కాలినడకన బయల్దేరింది.
రవాణా సౌకర్యాలు లేకున్నా.. మధ్యలో కరోనా ఆంక్షల కారణంగా ఇబ్బందులు ఎదురైనా.. ఎక్కడా ఆగలేదు. అడ్డంకులు అధిగమించింది. అనుకున్నది సాధించింది. మచిలీపట్నానికి అవలీలగా చేరి ప్రేమికుడు కళ్లేపల్లి సాయి పున్నయ్య (22)ను కలుసుకుంది. మరో క్షణం ఆలస్యం చేయకుండా.. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. విషయం తెలిసిన యువతి కుటుంబీకుల నుంచి ప్రేమ దంపతులకు బెదిరింపులు ఎదురయ్యాయి. చివరికి రక్షణ కోసం.. చిలకలపూడి పోలీసులను ఆశ్రయించింది ఆ జంట.
ఇరు కుటుంబాల పెద్దలతో మాట్లాడిన పోలీసులు.. కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ జంట పెళ్లిని అంగీకరించేలా చేశారు. రీల్ స్టోరీని మించిన రియల్ లవ్ స్టోరీతో ఒక్కటైన ఈ జంటకు.. అంతా శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఇదీ చూడండి: