Amaravati Padayatra Bouncer: అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్ర ఈనెల 22న కోనసీమ జిల్లా రామచంద్రపురంలో నిలిచిపోయింది. కోర్టు తీర్పు వెలువడ్డాక కోనసీమ జిల్లా రాయవరం మండలం పసలపూడిలో పోలీసులు అడ్డుకోవడంతో యాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. వెంకటేశ్వరుని దివ్య రథంతో పాటు సామగ్రి, ఇతర వాహన శ్రేణినిని రామచంద్రపురం ఆర్డీవో కార్యాలయం ఎదుట ప్రైవేటు స్థలంలో నిలిపి ఉంచారు. ఈ స్థలంలో రథం కాపలాదారులుగా ఉన్న బౌన్సర్లపై వద్దకు వచ్చిన డీఎస్పీ బాలచంద్రారెడ్డి వారిని వివరాలు అడిగారు. తాము సమాధానం చెప్పేలోపే చేతితో, లాఠీతో కొట్టారని బౌన్సర్లు దుర్గాప్రసాద్, చైతన్య, రామకోటేశ్వరరావు వాపోయారు. పొట్టకూటికోసం వచ్చిన తమపై అకారణంగా పోలీసులు దాడి చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రథానికి అమర్చిన సీసీ కెమెరా పుటేజ్‌ను సైతం పోలీసులు తీసుకెళ్లారని వారు వివరించారు.
పోలీసులు కాపలాదారుల్ని కొట్టిన విషయం తెలుసుకున్న తెలుగుదేశం నాయకులు చినరాజప్ప, రెడ్డి సుబ్రహ్మణ్యం, సీపీఐ, భాజపా సహా వివిధ పక్షాల నాయకులు రామచంద్రపురం వచ్చి.. బౌన్సర్లకు సంఘీభావం తెలిపారు. ఆ తర్వాత పోలీసుస్టేషన్‌కు వెళ్లి సీసీ పుటేజ్, హార్డ్‌డిస్కులను ఎందుకు తీసుకువచ్చారని నిలదీయగా.. అది కోర్టుకు సమర్పిస్తామని పోలీసులు తెలిపారు. తమపైనే బౌన్సర్లు దురుసుగా ప్రవర్తించారని అందుకే వారిని నియంత్రించామని డీఎస్పీ చెప్పడంపై నేతలు మండిపడ్డారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఓ వైపు అధికార పక్ష నేతలు తమపై తీవ్ర స్థాయిలో విమర్శలు, అవహేళనలు చేస్తుండగా.. మరోవైపు పోలీసులు వ్యవహరిస్తున్న తీరు కలవరపాటుకు గురిచేస్తోందని అమరావతి ఐకాస నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: