రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించే శక్తి గోదావరి జిల్లా ప్రజలకే ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మార్పు రావాలంటే గోదవారి జిల్లాలతోనే సాధ్యమని చెప్పారు. జనసేన కౌలు రైతు భరోసాయాత్రలో భాగంగా.. కోనసీమ జిల్లా మండపేటలో ఆత్మహత్య చేసుకున్న 52 మంది కౌలు రైతుల కుటుంబాలకు పవన్ ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా మండపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో ఎవరివైపు నిలబడతారో నిర్ణయించుకోవాలని ప్రజలకు సూచించారు. తమ పార్టీ అభ్యర్థులను చూడొద్దని..,తనను చూడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గోదావరి జిల్లాల్లో మార్పు మొదలైతే పులివెందుల వరకు వెళ్తుందని అన్నారు. మార్పు కోసమే జనసేన పార్టీ వచ్చిందని.., జనవాణి పెట్టగానే వైకాపా నేతలకు మెలకువ వచ్చిందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర భవిష్యత్తు మార్చాలంటే తాను ఒక్కడే పోరాడితే సరిపోదని చెప్పారు. మీ అండదండలుంటే 2024లో కాకుంటే ఆ తర్వాతైనా అధికారంలోకి వస్తానని పవన్ అన్నారు.
"అధికారంలోకి వస్తే ఏం చేస్తామో వివరిస్తాం. అధికారంలోకి వస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగు చేస్తాం. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తాం. గోదావరి వరద బాధితులకు జనసైనికులు సాయం చేయాలి. తెలుగు ప్రజల ఐక్యత కోరుకుంటున్నా. ఏపీ భవిష్యత్తుకు వైకాపా ప్రభుత్వం హానికరం. వైకాపా ప్రభుత్వం మరోసారి వస్తే ఏం జరుగుతుందో ఊహించాలి. నాకు ఎలాంటి కోరికలు లేవు. అధికారం వస్తే మంచిది.. రాకున్నా పోరాటం ఆపను. వంద తప్పులు సహిస్తాం.. భరిస్తాం.. తర్వాత తాట తీస్తాం. పోలీసులు కూడా వ్యవస్థ ప్రకారం పనిచేయాలి. అన్యాయం, తప్పు చేస్తే ప్రజలు ఎదురుతిరగాలి. ఎంతమందిపై కేసులు పెడతారు.. జైలులో పెడతారు. శ్రీలంక పరిస్థితి చూడండి.. ఏమైందో తెలుస్తోంది." -పవన్, జనసేన అధినేత
చెల్లించే పన్నులనే ప్రభుత్వం ప్రజలకు ఇస్తోందని పవన్ మండిపడ్డారు. ప్రభుత్వంలో లేకున్నా కౌలురైతులకు సాయం చేస్తున్నామన్నారు. మనకు ధైర్యం లేకుంటే అరాచకమే రాజ్యం ఏలుతుందని హితవు పలికారు. ప్రభుత్వం తప్పు చేస్తే సరిచేసే బాధ్యత యువత తీసుకోవాలని సూచించారు. యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. నాయకుల వెంట జెండాలు మోసే యువత ఎందుకని ప్రశ్నించారు. నాయకులను నిలదీసే యువత కావాలన్నారు. కౌలురైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం ఇష్టపడటం లేదని పవన్ అన్నారు.
"నేను మాటలు నమ్మను.. చేతలనే నమ్ముతాను. పంచాయతీలకు వైకాపా ప్రభుత్వం నిధులు ఇచ్చిందా ?. ఎన్నికల్లో ఎవరిపక్షం ఉంటారో యువత నిర్ణయించుకోవాలి. వచ్చే ఎన్నికలకు జనసేన సిద్ధంగా ఉంది. వచ్చే ఎన్నికల తర్వాత జనసేన జెండా ఎగరడం ఖాయం. ప్రజలు కులాల స్థాయిని దాటి ఆలోచించాలి. కోనసీమకు అంబేడ్కర్ పేరు పెడితే మెుదట మేమే స్వాగతించాం. పాఠశాలలు విలీనం చేసి దూరం వెళ్లమంటే ఎలా ?. చిన్న పిల్లలు కిలోమీటర్లు నడిచి బడికి వెళ్లగలరా ?." - పవన్, జనసేన అధినేత
ఇవీ చూడండి