woman came home after 20 years: ఉపాధి నిమిత్తం ఎడారి దేశానికి వెళ్లిన ఓ మహిళ అక్కడ మోసపోవడంతో.. 20 ఏళ్ల నుంచి ఎన్నో కష్టాలు పడి ఆహారం లేక ఇబ్బందులు పడుతూ అనారోగ్య బారిన పడింది. ఆమెను ముంబయికి చెందిన వ్యక్తి చేరదీసి రెండేళ్ల నుంచి కన్న కొడుకు కంటే ఎక్కువగా సేవలందించి దగ్గరుండి స్వగ్రామానికి పంపి మానవత్వం చాటుకున్నాడు.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు నియోజకవర్గం సనేటిపల్లిలోని అడ్డాలపాలేనికి చెందిన మూరి పద్మావతి (64) జీవనోపాధి కోసం కువైట్ వెళ్లింది. అక్కడ కంపెనీ వాళ్లు మోసం చేయడంతో తిరిగి స్వదేశానికి రావడానికి వీసా లేక అష్టకష్టాలు పడి జీవనం సాగించారు. ఇంతటి కష్ట సమయంలో ముంబయికి చెందిన మహ్మద్ యునస్ అనే వ్యక్తి సాయంతో స్వగ్రామానికి చేరుకుంది.
ఇదీ జరిగింది.. మూరి పద్మావతి 2001లో జీవనోపాధి నిమిత్తం కంపెనీ వీసాపై కువైట్ వెళ్లింది. తీరా అక్కడకు వెళ్లిన తరువాత వీసా తీసిన వ్యక్తి మోసం చేయడం, ఆ కంపెనీ మూసేయడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది.. ఇంటికి తిరిగి రావడానికి వీసా లేక ఏమి చేయాలో తెలియని స్థితిలో ఆమె ఇబ్బంది పడింది. పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇళ్లల్లో ఎవరికీ తెలియకుండా పని చేసుకుంటూ జీవనం సాగించారు. ఇలా కొన్నేళ్లు చేసిన తరువాత కరొనా సమయంలో అనారోగ్యానికి గురయ్యారు. ఆ సమయంలో ముంబయికి చెందిన మహ్మద్ యూనస్ అనే వ్యక్తి ఆమెకు వైద్యం చేయించి సుమారు రెండేళ్లుగా సేవలందించి.. ఆమెను తల్లిలా చూసుకుని ఇంటికి పంపడానికి కృషి చేశారు.
ఎంతో మందితో చర్చించి తిరిగి స్వగామానికి.. ఆ పెద్దావిడను ఇంటికి పంపేందుకు యూనస్ ఎంతో కృషి చేశాడు. ఏపీకి చెందిన కొందరిని సంప్రదించి ఏపీఎన్ఆర్టీ ఆధ్వర్యంలో ఇండియన్ ఎంబసీతో చర్చించి స్వగ్రామానికి పంపేందుకు సర్వం సిద్ధం చేశాడు. అంతే కాకుండా ఆ పెద్దావిడపై ఏ విధమైన కేసులు లేకుండా చేశాడు. అమెకు తోడుగా హైదరాబాద్ వరకు వచ్చి ఖర్చులకు కొంత నగదు ఇచ్చి స్వగ్రామానికి పంపాడు.
తాను పడిన బాధను వివరిస్తూ.. 20 ఏళ్లుగా తాను పడుతున్న ఇబ్బందులతో పాటు సరిగా ఆహారం లేక అనారోగ్యం క్షీణించిందని.. తరచూ ఇంటికి ఫోన్ చేసి కొడుకు, కోడలితో ఇక నేను ఇంటికి చెరుకోలేనేమో అని చెప్పి.. కన్నీరు పెట్టేదానిని అని బాధను వ్యక్తం చేసింది.. సమస్యను యూనస్కి చెప్పగా రెండేళ్లుగా ఆహారం అందించడంతో పాటు చేతులు పని చేయకపోతే అన్నం కలిపి పెట్టేవాడని.. ఏ సంబంధము లేని వ్యక్తి కన్న కొడుకులా సేవలందించి ఇంటికి రావడానికి ఎంతో కృషి చేశాడని తెలిపింది.
ఒక్కరోజు మాత్రమే సెలవు దొరికింది.. అలా దొరికిన తర్వాత వెళ్లడానికి రావడానికి 300 దినార్లు.. అలాగే నాకు 150 దినార్లు మొత్తం 450 దినార్లు అతని సొంత డబ్బుతో నన్ను తీసుకువచ్చాడు. మాకు టికెట్ దొరకకపోయే సరికి కువైట్ నుంచి చెన్నై.. మళ్లీ అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చాము. హైదరాబాద్ నుంచి అంబులెన్స్ ద్వారా ఇంటికి వచ్చాను.- పద్మావతి, అడ్డాలపాలెం