A big accident missed in Mummidivaram mandal Gadilanka: ఇటీవల కాలంలో ఇంటి పరిసరాల్లో.. గడ్డివాముల్లో.. వాషింగ్ మిషన్లో.. మోటార్ సైకిల్లో ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా పాములు సంచరిస్తున్న ఘటనలు సామాజిక మాధ్యమాల ద్వారా చూస్తూనే ఉన్నాం. వాటి కదలికలను గుర్తించిన వారు వెంటనే అప్రమత్తమై.. పాములు పట్టే వ్యక్తికి సమాచారం ఇస్తున్నారు. దీంతో ఆ వ్యక్తులు (పాములు పట్టేవారు) చాకచక్యంగా వాటిని ఓ సంచిలో బంధించి, జన సంచారం లేని ప్రాంతాల్లో వదిలిపెడుతున్నారు. తాజాగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గాడిలంక గ్రామం వద్ద ఓ విచిత్ర సంఘటన జరిగింది. జాతీయ రహదారిపై వేగంగా దూసుకుపోతున్న కారు స్టీరింగ్ పైకి ఓ పాము వచ్చింది. దీంతో ఆ కారు డ్రైవర్, అందులో ప్రయాణిస్తున్న వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
స్టీరింగ్‌పైకి వచ్చిన పాము-అదుపు తప్పిన కారు.. కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గాడిలంక వద్ద ఈరోజు పెను ప్రమాదం తప్పింది. జాతీయ రహదారిపై వేగంగా దూసుకుపోతున్న కారు స్టీరింగ్‌పైకి ఓ పాము వచ్చింది. దీంతో ఆ కారు డ్రైవర్ భయాందోళనకు గురై, స్టీరింగ్‌ను వదిలిపెట్టాడు. క్షణాల వ్యవధిలోనే ఆ కారు పక్కనే ఉన్న పొలాల్లోకి వేగంగా దూసుకెళ్లింది. ఆ సమయంలో కారులో ఉన్నవారందరు భయంతో గజగజ వణికిపోయారు. అదృష్టవశాత్తూ కారులో ఉన్నవారికి ఎటువంటి గాయాలు గానీ, ప్రాణం నష్టం గానీ జరగకపోవడంతో స్థానికులు, వాహనదారులు ఊపిరిపీల్చుకున్నారు.
కొత్తలంక బాబా మందిరానికి వెళ్తుండగా ప్రమాదం.. 'కేంద్ర పాలిత ప్రాంతమైన యానం నుంచి ఓ ముస్లిం కుటుంబం ముమ్మిడివరం గాడిలంకలో ఉన్న కొత్తలంక బాబా మందిరానికి వారి సొంత కారులో వెళ్తున్నారు. ప్రయాణంలో ఉన్న కారులోని స్టీరింగ్ పైకి ఓ పాము వచ్చింది. దీంతో డ్రైవర్ కంగారు పడి భయంతో స్టీరింగ్‌ని వదిలేశాడు. వెంటనే కారు అదుపుతప్పి ప్రక్కనే ఉన్న పంట పొలంలోకి దూసుకుపోయింది. ఈ అనుకోని సంఘటనతో కారులో ఉన్నవారు తీవ్ర భయాందోళన గురయ్యారు. అయితే, ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణహాని జరగలేదు.' అని స్థానికులు వెల్లడించారు.
వీడియో వైరల్.. కారు పొలంలోకి దూసుకుపోవటాన్ని గమనించిన చుట్టుప్రక్కల స్థానికులు.. వెంటనే అప్రమత్తమై, ట్రాక్టర్ సహాయంతో కారును రోడ్డుపైకి తీసుకువచ్చారు. ఈ గందరగోళంలో కారులోని పాము ఎక్కడికి పోయిందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్‌గా మారింది. వీడియోలో ఉన్న ప్రకారం.. 'కారు పంట పొలాల్లోకి దూసుకుపోగా.. కొంతమంది స్థానికులు దానిని బయటికు తీసే ప్రయత్నం చేశారు. పొలంలో ఉన్న కారును ఎంత నెట్టిన కదలకపోవడంతో.. ఓ ట్రాక్టర్‌ను రప్పించి ఓ తాడుతో కారును రోడ్డుపైకి లాగారు.'