Groynes and Revetments Construction in Godavari Flood Areas: ఆగస్టు 8వ తేదీన కోనసీమ జిల్లాలో గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో నది కోత వల్ల ఊళ్లు ఎలా దెబ్బతిన్నాయో పరిశీలించినప్పడు సీఎం జగన్ గోదావరి వరద ప్రాంతాల్లో గ్రోయిన్లను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. గోదావరి నది కోత వల్ల ఇళ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో రివిట్‌మెంట్లు, గ్రోయిన్ల నిర్మాణాల కోసం 200 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని.. అంచనాలు వేసి నెల రోజుల్లోపే టెండర్లు పూర్తి చేయాలని అన్నారు. రెండు నెలల్లోనే పనులు మొదలవుతాయని ప్రజలందరీ ముందు గొప్పగా చెప్పారు.. కానీ ఇప్పటికీ ఆ పనులకు ప్రభుత్వం నుంచి పాలనా ఆమోదం దక్కలేదు.
నాయకుడు చెప్పిన మాటకు కట్టుబడి ఉండకపోతే ఇక ఆ మాటకు అర్ధం ఏముంటుందని సాక్షాత్తూ సీఎం జగన్ అనేకసార్లు చెప్పారు. ముఖ్యమంత్రి. స్థానంలో ఉండి మాట తప్పితే.. ఆ పదవినైనా వదులుకోవాలి తప్ప మాటకు కట్టుబడి ఉండాలని బహిరంగంగా ఆయన చెప్పారు. మరి పవిత్ర గోదావరి సాక్షిగా ప్రజలకు ఆయన ఇచ్చిన మాటను తప్పేశారు. ప్రజలతో చప్పట్లు కొట్టించుకునేందుకు ఆయన పడ్డ తాపత్రయంలో కొంతైనా మాట నిలబెట్టుకోవటంలో చూపించలేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గోదావరి వరదలకు కోనసీమ నదీ పరీవాహక ప్రాంతాలు తల్లడిల్లిపోయాయి. ఈ క్రమంలో సీఎం జగన్... ఈ ఏడాది ఆగస్టు 8న ముమ్మిడివరం మండలం గురజాపులంక, కూనలంక, ఠాణేలంక, అయినవిల్లి మండలం కొండుకుదురులంక ప్రాంతాల్లో నదీ కోత ప్రాంతాలను పరిశీలించారు. రక్షణగా గ్రోయిన్లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరగా అక్కడికక్కడే ఆయన ఈ పనులకు 200 కోట్లు రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
నెలరోజుల్లో టెండర్లు పూర్తి చేస్తామని చెప్పారు. అంటే ఎంత లేదన్నా సెప్టెంబరు నెలాఖరుకు అవి పూర్తి కావాలి. ఆ తర్వాత నెల రోజుల్లో పనులు ప్రారంభిస్తామని ప్రజల మధ్య సెలవిచ్చారు. అక్టోబరు నెలాఖరు కల్లా వాటిని ప్రారంభించాలి. కానీ ఇప్పటి వరకు ఆ హామీని పట్టించుకోలేదు.
సీఎం హామీ మేరకు ముమ్మిడివరం నియోజకవర్గంలోని అయిదు ప్రాంతాల్లో గ్రోయిన్ల నిర్మాణానికి 150 కోట్ల రూపాయలతో జలవనరుల శాఖ అధికారులు ప్రతిపాదనలు ఆర్థిక శాఖకు పంపారు. కానీ ఈ పనులకు పాలనామోదం ఇంకా దక్కలేదు. 2022 సంవత్సరంలో గోదావరి వరదల సమయంలో రాజోలు నియోజకవర్గంలోనూ సీఎం జగన్ ఇలాంటి హామీలే ఇచ్చారు.
మండలంలోని మేకలవానిపాలెం, బూరుగులంక వద్ద కూడా గ్రోయిన్ల నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు. ఇప్పటికీ అతీగతీ లేదు. అంతేకాదు ఎప్పుడో 2020వ సంవత్సరంలోనే ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో వరద గట్ల రక్షణకు ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించి.. అనేక చోట్ల కరకట్టలు బలహీనంగా ఉన్నాయని తేల్చి చెప్పింది. ఇందుకు అనుగుణంగా చర్యలు చేపట్టే నాధుడే లేడు.