Rs 1 Crore to Child Treatment: అరుదైన గాకర్స్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి హనీ వైద్యానికి సీఎం జగన్ కోటి రూపాయలు కేటాయించారు. కోనసీమ జిల్లా అల్లవరం మండలం నక్కా రామేరానికి చెందిన కొప్పాడి రాంబాబు, నాగలక్ష్మి దంపతుల కుమార్తె హనీ పుట్టుకతో గాకర్స్ వ్యాధితో బాధపడుతోంది. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో కోనసీమ జిల్లా గంటి పెద్దపూడిలో సీఎం పర్యటించారు. తిరుగు ప్రయాణంలో ఉండగా.. హనీ తల్లిదండ్రులు చిన్నారిని కాపాడాలంటూ ప్రదర్శించిన ప్లకార్డును సీఎం చూశారు. వెంటనే కాన్వాయ్‌ను ఆపి వారితో మాట్లాడారు. హనీకి సోకిన వ్యాధి, చేయాల్సిన వైద్యం గురించి ఆరా తీశారు. చిన్నారి ప్రాణాలు నిలిపేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలని, ఖర్చు ఎంతైనా పర్వాలేదని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాను అప్పుడు సీఎం ఆదేశించారు.
కలెక్టర్ పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం, వాటిని మంజూరు చేసింది. హనీ వైద్యం కోసం కోటి రూపాయలు మంజూరు చేస్తూ ఆదేశాలు ఇచ్చిందని కలెక్టర్ వెల్లడించారు. ఇవాళ అమలాపురంలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో చిన్నారి హనీకి ఇంజక్షన్లను కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ గాకర్స్ వ్యాధి నివారణ కొరకు రాష్ట్ర ప్రభుత్వం 52 ఇంజక్షన్లను మంజూరు చేసిందని,.. ప్రస్తుతం 13 ఇంజక్షన్లను స్థానిక ప్రాంతీయ ఆసుపత్రికి పంపించినట్లు తెలిపారు. ఈ ఇంజక్షన్ ఖరీదు రూ.1 లక్ష 25వేలు కాగా, కంపెనీతో తెప్పించారు. ప్రతి 15 రోజులకు ఒక ఇంజక్షన్‌ను, క్రమం తప్పకుండా చిన్నారికి ఇవ్వనున్నారు. అలాగే పాప భవిష్యత్తు, చదువు కోసం సహాయం అందించాలని సీఎం ఆదేశించినట్లు కలెక్టర్ వెల్లడించారు.
ఇవీ చదవండి: