Break to Amaravati padayatra: మహాపాదయాత్రకు రాజధాని రైతులు తాత్కాలిక విరామం ప్రకటించారు. కోనసీమ జిల్లా పసలపూడిలో రైతులపై పోలీసుల దాడికి నిరసనగా ఐకాస కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల భద్రత పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ కొద్దిరోజుల పాటు పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించింది. పోలీసులు అడుగుతున్న అన్ని రకాల పత్రాలు చూపిన తర్వాతే తిరిగి యాత్ర ప్రారంభిస్తామని రైతులు చెప్పారు.
కోనసీమ జిల్లాలో అమరావతి రైతులు బస చేసిన కల్యాణమండపం వద్ద పాదయాత్రికులు బయటకు రాకుండా ఉదయం పోలీసులు అడ్డుకున్నారు. రైతులను కలిసేందుకు బయటవారెవ్వరినీ అనుమతించలేదు. సంఘీభావం తెలిపేందుకు వస్తున్న వారిని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దీంతో రైతులు బస చేస్తున్న కళ్యాణమండపం వద్ద కొద్దిసేపు ఉద్రక్తత నెలకొంది. పెద్ద ఎత్తున పోలీసులు తరలిరావడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల భద్రత కోసమే తాము పనిచేస్తున్నామని.. గుర్తింపు కార్డులు చూపి పాదయాత్ర యథాతథంగా నిర్వహించుకోవచ్చని పోలీసులు తెలిపారు.
రైతులపై పోలీసులు, ప్రభుత్వం చేస్తున్న కక్షసాధింపు చర్యలకు నిరసనగా.. 40 రోజుల సుదీర్ఘ పాదయాత్ర చేసిన అమరావతి రైతులు.. తాత్కాలిక విరామం ప్రకటించారు. ఈ వ్యవహారాన్ని న్యాయస్థానంలో తేల్చుకునే తిరిగి మళ్లీ యాత్ర ప్రారంభిస్తామని అమరావతి ఐకాస స్పష్టం చేసింది. మహిళల భద్రత దృష్ట్యా కొన్ని రోజులు పాదయాత్ర నిలిపేయాలని ఐకాస నిర్ణయించింది. పాదయాత్రకు తాత్కాలిక విరామం మాత్రమే ప్రకటించామన్న ఐకాస నేతలు.. తదుపరి కార్యాచరణపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. పాదయాత్రకు సృష్టిస్తున్న అడ్డంకులను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తామన్నారు.
కోర్టు నిబంధనలు, పోలీసుల తీరుపై న్యాయస్థానంలో అప్పీల్‌కు వెళ్లాలని రైతులు యోచిస్తున్నారు. ప్రస్తుతం న్యాయస్థానానికి సెలవులు ఉన్నందున పనిదినాలు ప్రారంభం కాగానే పిటిషన్ దాఖలు చేసి అక్కడనుంచి వచ్చే మార్గదర్శకాలకు అనుగుణంగా తదుపరి కార్యాచరణ ప్రకటించనున్నారు.
"పోలీసులు మహిళలను తీవ్రంగా గాయపరిచారు. మహిళల భద్రత పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నాం. పాదయాత్రకు తాత్కాలిక విరామమే ప్రకటించాం. తదుపరి కార్యాచరణపై చర్చించి ప్రకటిస్తాం. అడ్డంకులన్నీ కోర్టు దృష్టికి తీసుకెళ్తాం. కోర్టును ఆశ్రయించి తదుపరి నిర్ణయం ప్రకటిస్తాం. రైతులను మట్టుపెట్టేలా పోలీసు, ప్రభుత్వ చర్యలు ఉన్నాయి. మహిళలపై దాడులకు నిరసనగానే తాత్కాలిక విరామం." -అమరావతి ఐకాస నేతలు
ఇవీ చదవండి: