TDP leader Yanamala Ramakrishnudu: రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని.. అప్పుల్లో ఉన్న వృద్ది.. స్థూల ఉత్పత్తిలో కనపడటం లేదని శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. రాబోయే రోజుల్లో అసలు, వడ్డీ కలుపుకుని ఏటా లక్ష కోట్లు కట్టాల్సివచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వైకాపా నాయకుల ఆస్తులు పెరుగుతుంటే.. ప్రజల ఆదాయం తగ్గుతోందని విమర్శించారు. ఆర్టికల్ 360ని అమలు చేసి రాష్ట్రంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాలన్నారు. ఆర్థికశాఖ పూర్తిగా సీఎంఓ చేతుల్లోకి వెళ్లిపోయిందని యనమల దుయ్యబట్టారు. జగన్ రెడ్డి తన అసమర్ధత కారణంగా రాష్ట్రం ఆర్థికంగా బలోపేతమవడానికి ఉన్న అన్ని దారులు మూసుకుపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
క్లిష్టమైన పరిస్థితులలో వాడుకునే ఓవర్ డ్రాప్ట్ గత ఏడాది 136 రోజులు తీసుకున్నారని తెలిపారు. ఈ ఏడాది (ఓడీ)కి వెళ్లకుంటే పని జరిగే పరిస్థితి లేదని రామకృష్ణుడు మండిపడ్డారు. ఓడీ పరిమితులు కూడా దాటిపోయి జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని ధ్వజమెత్తారు. ఒకసారి ఓడీ తీసుకుంటే దాన్ని 14 రోజులలోపు చెల్లించాలని.., ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఓడీ ఇప్పటికే 12 రోజులు పూర్తయ్యాయని తెలిపారు. ఇక జగన్ ప్రభుత్వానికి మిగిలింది కేవలం 2 రోజులు మాత్రమే అని యనమల గుర్తు చేశారు. ఈ రెండు రోజుల్లో ఓడీ చెల్లించకపోతే ఆర్బీఐలో రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలన్నీ మూసేస్తారని తెలిపారు. ఇదే సంభవిస్తే దేశంలోనే ఆర్ధికంగా అత్యంత క్లిష్టపరిస్థితిల్లోకి వెళ్లిన రాష్ట్రంగా ఏపీ నిలుస్తుందని హెచ్చరించారు. రాష్ట్రానికి ఇటువంటి ఘోరమైన పరిస్థితి ఇప్పటివరకు దాపురించలేదన్నారు.
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై ఆర్బీఐ 9వ తేదీన నోటీసు ఇచ్చినట్లు తమకు సమాచారం ఉందన్నారు. ఓడీ మూసుకుపోతే బిల్లులు కూడా చెల్లించమని ఆర్బీఐ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖను ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. అప్పుల వృద్ధి ఈ ప్రభుత్వం హయాంలో 37.5 శాతంగా ఉందని తెలిపారు. ఆ మేరకు రాష్ట్ర స్థూల ఆదాయం మాత్రం పెరగడం లేదని ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి అధికారం నుంచి దిగిపోయే నాటికి రాష్ట్రానికి దాదాపు 10 లక్షల కోట్లు అప్పు ఉంటుందన్నారు.
ఇవీ చదవండి: