వైకాపా ప్రభుత్వంలో అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలపై.....కాకినాడ జిల్లా జగ్గంపేటలో తెలుగుదేశం రైతుపోరు సభ నిర్వహించింది. గోదావరి జిల్లాల నుంచి భారీ సంఖ్యలో రైతులు హాజరయ్యారు. తెలుగుదేశం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ ఆధ్యక్షతన నిర్వహించిన సభలో.....వైకాపా పాలనలో వ్యవసాయ రంగం పూర్తి సంక్షోభంలో కూరుకుపోయిందని నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పరిస్థితి ఇలానే కొనసాగితే రైతులు, రైతు కూలీలు వలస పోవడం తప్పదన్నారు. జగన్ పాలనలో విత్తనం నుంచి విక్రయం వరకు రైతు దగాకు గురయ్యాడని.....గిట్టుబాటు ధరపేరుతో రైతులను నిండా ముంచారని విమర్శించారు.
అందుకే రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నారని అన్నారు. పైగా మీటర్లకు మోటర్లు పెట్టి అన్నదాతల మెడకు ఉరితాళ్లు బిగిస్తున్నారని....ఈ ప్రయత్నాన్ని తాము అడ్డుకుని తీరుతామని స్పష్టంచేశారు. వ్యవసాయంతోపాటు పాల డెయిరీలను సైతం నిర్వీర్యం చేసి గుజరాత్ కంపెనీలకు రాష్ట్ర ప్రజల సొమ్మును ఖర్చు చేస్తున్నారని.....సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు.
రైతు గెలవాలి-వ్యవసాయం నిలవాలని అన్నది చంద్రబాబు నినాదమన్న మరో సీనియర్ నేత యనమల.....జగన్ ప్రభుత్వం మాత్రం రైతును నట్టేట ముంచుతుందన్నారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు స్వామినాథన్ సిఫార్సులను అమలు చేస్తామని స్పష్టంచేశారు. అంతకు ముందు మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో పిఠాపురం నుంచి జగ్గంపేట వరకు తెలుగుదేశం నేతలు, రైతులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఇదీ చదవండి: భవిష్యత్తులో అలాంటి రాజకీయాలు రావాలి: పవన్