కాకినాడలో వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఎలా మృతి చెందాడన్నది అంతుచిక్కడం లేదు. స్వయంగా ఎమ్మెల్సీనే తన కారులో సుబ్రహ్మణ్యంను తీసుకెళ్లడం, ప్రమాదం జరిగిందని అర్ధరాత్రి కుటుంబసభ్యులకు చెప్పడం, కొద్దిసేపటి తర్వాత కారు వెనుకసీటులో మృతదేహాన్ని తీసుకురావడం అనుమానాలకు కారణమవుతున్నాయి. మృతదేహాన్ని తీసుకోవడానికి సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులు నిరాకరించగా... ఎమ్మెల్సీ వారిని బెదిరించి, కారు అక్కడే వదిలేసి వెళ్లిపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.
అనుమానాస్పదంగా చనిపోయిన సుబ్రహ్మణ్యం... ఐదేళ్లపాటు ఎమ్మెల్సీ అనంతబాబు దగ్గర డ్రైవర్‌గా పనిచేశారు. ఇటీవల కొంతకాలం క్రితం డ్రైవర్ పని మానేసి, ఇంటి దగ్గరే ఉంటున్నారు. గురువారం రాత్రి పదిన్నర గంటలకు స్నేహితులతో కలిసి కాకినాడ కొండయ్యపాలెంలో సుబ్రహ్మణ్యం ఉండగా... ఎమ్మెల్సీ అనంతబాబు కారులో అక్కడికి వచ్చి సుబ్రహ్మణ్యాన్ని తీసుకెళ్లారు. అర్ధరాత్రి పన్నెండున్నర గంటలకు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ ఫోన్ చేసి... నాగమల్లితోట దగ్గర ప్రమాదం జరిగిందని చెప్పారు. సుబ్రహ్మణ్యాన్ని ఆసుపత్రికి తీసుకెళ్తున్నానని, అక్కడికి రమ్మని పిలిచారు. మళ్లీ రాత్రి ఒకటిన్నరకు అనంతబాబే తన కారులో సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని వెనుక సీటులో వేసుకుని తీసుకొచ్చారు.
మృతదేహాన్ని తీసుకోవాలని ఎమ్మెల్సీ సూచించగా.... నీరు కారుతూ, ఇసుకతో ఉండటంతో అసలేం జరిగిందని సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులు అడిగారు. బండి ఢీకొట్టిందని ఎమ్మెల్సీ చెప్పడంతో... తమకు చెప్పాలి గానీ మీరెలా తీసుకొచ్చారని వారు ప్రశ్నించారు. తనతో గొడవ పడొద్దని, శవాన్ని కిందకు దించాలని ఆయన గద్దించారు. శవాన్ని అలాగే ఉంచాలని, కేసు నమోదయ్యాకే దింపుతామని కుటుంబసభ్యులు స్పష్టంచేశారు. వెంటనే దించి జీజీహెచ్‌కు తీసుకెళ్లాలంటూ కారులో శవాన్ని ఉంచి తాళం వేసుకుని వెళ్లిపోతుండగా... సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులు అడ్డుకున్నారు. ఆయన మళ్లీ వచ్చి కారు డోర్ తీసి... తాళం తీసుకుని వెళ్లిపోయారు. మృతదేహాన్ని అపార్టుమెంట్ వద్దకు తేవడం, అనంతబాబు బెదిరించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయని, వాటి ఆధారంగా పోలీసులు తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబసభ్యులు కోరుతున్నారు.
మృతుడి శరీరంపై ఎలాంటి గాయాలు లేవు. పెదవి పగిలింది. వీపు, మెడ, మోకాలు భాగాల్లో చీరుకుపోయిన గాయాలు, కవుకు దెబ్బలు, రెండు చేతులు విరిగి వేలాడుతున్నట్లు ఉన్నాయని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ప్రమాదం జరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వకుండా, మృతదేహాన్ని స్వయంగా ఎమ్మెల్సీనే ఎలా తీసుకొస్తారని ప్రశ్నిస్తున్నారు. తమ ఇంటి దగ్గర కారును, మృతదేహాన్ని వదిలేసి ఎమ్మెల్సీ వెళ్లిపోవడం అనుమానాలకు బలమిస్తోందని అంటున్నారు. రోడ్డు ప్రమాదం జరిగితే ఆసుపత్రికి తీసుకెళ్తారు. క్షతగాత్రులు చికిత్స పొందుతూ చనిపోయినా లేదా అక్కడికి తెచ్చాక చనిపోయినా ఆ సమాచారాన్ని ఆసుపత్రివారు పోలీసులకు అందించాల్సి ఉంటుంది. ఈ ఘటనలో చనిపోయిన వ్యక్తి సమాచారాన్ని పోలీసులకు చెప్పకుండా, ఆసుపత్రి వాళ్లు ఎమ్మెల్సీకి మృతదేహం ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. ఉదయం పదిన్నర గంటలకే సుబ్రమణ్యం మృతదేహాన్ని తరలించినా... సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు వరకు పోస్టుమార్టం చేయకపోవడమూ అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. కాకినాడ అర్బన్ నాగమల్లితోట కూడలిలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం ఏదీ జరగలేదని సర్పవరం సీఐ ఆకుల మురళీకృష్ణ చెప్పారని... అంటే ఎమ్మెల్సీ మాటలు వాస్తవం కాదనే విషయం బయటపడిందని చెబుతున్నారు.
అనంతబాబే చంపేశారు...
ఇది ముమ్మాటికీ రోడ్డు ప్రమాదం కాదు. ఎమ్మెల్సీ తన పుట్టినరోజని చెప్పి నా భర్తను తీసుకెళ్లారు. ఆయన పుట్టినరోజు నాలుగు నెలల కిందట అయిపోయింది. అనంతబాబు రహస్యాలు, వివాహేతర సంబంధాల గురించి అన్ని విషయాలూ నా భర్తకు తెలుసు. అందుకే చంపేసి శవాన్ని అనంతబాబే కారులో తీసుకొచ్చారు. ఇంతకుముందు ఎప్పడు నా భర్తను భోజనానికి రమ్మని పిలవలేదు, ఎమ్మెల్సీ మా ఇంటికి కూడా రాలేదు. నేను గర్భిణి అనే కారణంతోనే ఆయన దగ్గర నా భర్త డ్రైవర్ పని మానేశారు. - అపర్ణ, మృతుడి భార్య
చంపేస్తానని బెదిరించేవారు
ఎమ్మెల్సీ అనంతబాబు దగ్గర రూ.70 వేల దాకా అప్పు తీసుకున్నాం. ఇప్పటికే రూ.50 వేలు తీర్చేశాం. ఇంకో రూ.20 వేలు ఇవ్వాలి. ఈ నగదు కోసం తరచూ ఫోన్ చేసి అడిగేవారు. అప్పయినా తీర్చాలి, లేదా పనిలోకి రావాలని ఒత్తిడి చేసేవారు. లేకపోతే కాళ్లు చేతులు విరిచేసి, చంపేస్తానని చాలాసార్లు ఫోన్ చేసి బెదిరించారు. మృతదేహాన్ని తీసుకుని అనంతబాబు ఒక్కరే వచ్చారు. ఇది రోడ్డుప్రమాదం కాదు. ఆయనే నా కొడుకును బీచ్‌కు తీసుకెళ్లి చంపించారని అనుమానంగా ఉంది. - నూకరత్నం, మృతుడి తల్లి
నాగమల్లితోటలో ప్రమాదమేమీ జరగలేదు
కాకినాడ అర్బన్ నాగమల్లితోట కూడలిలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం ఏదీ జరగలేదు. అక్కడ రోడ్డుప్రమాదంలో తన కుమారుడు సుబ్రహ్మణ్యం మరణించినట్లు ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ తెలిపారని.. మృతుడి తల్లి నూకరత్నం చెప్పారు. దీనిపై ఏఎస్సై భద్రరావు, సిబ్బందితో తనిఖీ చేయించారు. అక్కడ ఎలాంటి ప్రమాదం జరగలేదని తేలింది. దీంతో ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎస్సై సతీష్‌బాబు అనుమానాస్పద మృతి కేసుగా నమోదుచేశారు. అనంతరం కేసును పట్టణ రెండో పోలీసుస్టేషన్‌కు బదిలీ చేశాం. - ఆకుల మురళీకృష్ణ, సర్పవరం సీఐ
కుటుంబసభ్యులు వ్యక్తం చేస్తున్న అనుమానాలివీ...
* రోడ్డు ప్రమాదంలో చనిపోతే.. మృతదేహం అంతా నీరు కారుతూ.. సముద్రపు ఇసుకతో ఎలా ఉంటుంది?
* మృతుడి శరీరంపై ఎలాంటి గాయాలు లేవు. పెదవి పగిలింది. వీపు, మెడ, మోకాలు, తదితర భాగాల్లో చీరుకుపోయిన గాయాలు, కవుకు దెబ్బలు, రెండు చేతులు విరిగి వేలాడుతున్నాయి.
* ప్రమాదం జరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వకుండా, మృతదేహాన్ని స్వయంగా ఎమ్మెల్సీనే ఎలా తీసుకొస్తారు?
* పోలీసులకు చెబుతామని చెప్పగానే కారును, మృతదేహాన్ని వదిలి ఎమ్మెల్సీ వెళ్లిపోవడం అనుమానాలకు బలమిస్తోంది.
* నిబంధనల మేరకు రోడ్డు ప్రమాదం జరిగితే ఆసుపత్రికి తీసుకెళ్తారు. క్షతగాత్రులు చికిత్స పొందుతూ చనిపోయినా.. అక్కడకు తెచ్చాక చనిపోయినా.. ఆ సమాచారాన్ని ఆసుపత్రి వారు ఠాణాకు అందించాలి. ఈ ఘటనలో చనిపోయిన వ్యక్తి సమాచారాన్ని పోలీసులకు చెప్పకుండా, ఆసుపత్రి వాళ్లు ఎమ్మెల్సీకి మృతదేహం ఎలా ఇచ్చారు?
* మృతదేహాన్ని ఉదయం 10.30 గంటలకే తరలించినా... సాయంత్రం 6.15 గంటల వరకు పోస్టుమార్టం చేయలేదు. మార్చురీ వద్దకు తెదేపా నాయకులు, దళిత సంఘాల ప్రతినిధులు వచ్చినా లోపలకు వెళ్లనీయకుండా పోలీసులు తాళాలు వేశారు. ఇవన్నీ పలు అనుమానాలకు తావిస్తున్నాయి.
నేడు కాకినాడకు తెదేపా నిజనిర్ధరణ కమిటీ : ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేసి విచారిస్తే అసలు విషయాలు బయటపడతాయని తెలుగుదేశం నేతలు అంటున్నారు. రంపచోడవం పరిధిలో ఆయన అరాచకాలకు హద్దే లేదని గుర్తుచేస్తున్నారు. సుబ్రహ్మణ్యం అనుమానాస్పద మృతిపై తెలుగుదేశం నిజనిర్ధరణ కమిటీ... నేడు కాకినాడ వెళ్లనుంది. పితాని సత్యనారాయణ, నక్కా ఆనంద్ బాబు, ఎంఎస్ రాజు, పీతల సుజాత, పిల్లి మాణిక్యాలరావుతో కూడిన బృందం.... మృతి ఘటనపై పరిస్థితిని తెలుసుకుని చంద్రబాబు నివేదిక అందించనుంది.
ఆయనే హత్య చేశారు: ప్రమాదంలో మరణిస్తే ఎమ్మెల్సీ వాహనంలోడ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని తీసుకురావడం..... పలు అనుమానాలకు తావిస్తోందని జైభీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు శ్రావణ్ కుమార్ అన్నారు. మృతుడి కుటుంబసభ్యులు చెబుతున్నట్లుగా ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ హత్య చేశారని ఆరోపించారు. ఆయనపై కేసు నమోదు చేయాలని శ్రావణ్‌కుమార్ డిమాండ్ చేశారు..
ఇదీ చదవండి: 'ప్రమాదంలో మరణిస్తే.. మృతదేహాన్ని ఎలా తరలిస్తారు?'