మాజీ డ్రైవర్, దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంత బాబును వైకాపా ఎట్టకేలకు పార్టీ నుంచి సస్పెండు చేసింది. ఈ నెల 19న రాత్రి ఈ హత్య జరగ్గా.. 6 రోజుల తర్వాత పార్టీ స్పందించడం గమనార్హం. ‘తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మరణానికి తానే బాధ్యుడినని ఎమ్మెల్సీ అనంత బాబు వాంగ్మూలం ఇచ్చినట్లు పోలీసులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో వైకాపా అధ్యక్షుడు జగన్ ఆదేశాల మేరకు అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం’ అని వైకాపా కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో ఎక్కడా ‘హత్య’ అనే పదాన్ని వాడలేదు. మరోవైపు హత్య కేసులో ప్రధాన నిందితుడిగా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబును రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి కలిశారు. సుమారు అర్ధగంటపాటు ఎమ్మెల్సీతో మాట్లాడారు.
ఈనెల 19న జరిగిన తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. హత్య జరిగిన తర్వాత ప్రతిపక్షాలు, వివిధ వర్గాల నుంచి అనంతబాబును అరెస్టు చేయాలని పోలీసులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి వచ్చింది. అంతబాబును అరెస్టు చేసేంతవరకు సుబ్రహ్మణ్యం మృతదేహానికి పోస్టుమార్టం సైతం నిర్వహించేందుకు కుటుంబసభ్యులు నిరాకరించారు. పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసే క్రమంలో అనూహ్యంగా అనంతబాబు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు ఆధ్వర్యంలో అనంతబాబును విచారించారు. విచారణ అనంతరం కాకినాడ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు.
సుబ్రహ్మణ్యాన్ని తానే హత్య చేశానని ఎమ్మెల్సీ అనంతబాబు అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు. ప్రాథమిక విచారణ, అనంతబాబు వాంగ్మూలం, ఇప్పటివరకు సేకరించిన సాంకేతిక ఆధారాలను బట్టి ప్రాథమిక దర్యాప్తులో ఆయన్ను నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశామని ఎస్పీ చెప్పారు. కాకినాడ జీజీహెచ్‌లో వైద్య పరీక్షల అనంతరం నిందితుణ్ని కాకినాడ స్పెషల్ మొబైల్ జేఎఫ్‌సీఎం కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి.. 14 రోజులు రిమాండుకు తరలించారు. ప్రస్తుతం అనంతబాబు జైలులో ఉన్నారు.
ఇవీ చూడండి