Many Restrictions During CM Jagan Samarlakota Tour: జగనన్న కాలనీల్లో జరిగే సామూహిక గృహప్రవేశాల కార్యక్రమానికి (Jagananna Colony House Warming Ceremony) ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ఉదయం 10 గంటలకు పెద్దాపురం చేరుకుంటారు. కొద్దిసేపు ప్రజాప్రతినిధులతో మాట్లాడుతారు. అక్కడి నుంచి రోడ్ షో ద్వారా సామర్లకోట ఈటీసీ జగనన్న లేఔట్‌కు చేరుకుంటారు. సామర్లకోటలో 44.4 ఎకరాల విస్తీర్ణంలో ఈటీసీ లేఅవుట్, 10 ఎకరాల విస్తీర్ణంలోని ప్రతిపాడు రోడ్డు లేఅవుట్లలో మొత్తం 2,412 ఇళ్లు మంజూరుచేశారు.
గత కొన్ని నెలలుగా ముఖ్యమంత్రి వస్తారని కసరత్తు చేస్తున్నా 1,003 ఇళ్లు మాత్రమే గృహప్రవేశాలకు సిద్ధం చేశారు. వీటిలో మంచి ముహూర్తాలు చూసుకుని ఇప్పటికే కొందరు గృహప్రవేశాలు చేశారు. అనంతరం సామర్లకోట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు.
కాకినాడ జిల్లా సామర్లకోటలోని జగనన్న కాలనీల్లో జరిగే సామూహిక గృహప్రవేశాల కార్యక్రమానికి సీఎం వస్తున్న నేపథ్యంలో అనేక ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ప్రజలపై ఒత్తిడి తెచ్చి సభకు తరలించేందుకు వాలంటీర్లు, కార్యదర్శులు, డ్వాక్రా సంఘాల ఆర్పీలకు తీవ్ర ఒత్తిళ్లుతో కూడిన ఆదేశాలు చేశారు. వీరి ఆడియో మెసేజ్‌లు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. వారంతా ఆయా వార్డుల్లో తెల్లవారుజామున నాలుగు గంటలకు వెళ్లి ప్రజల్ని 6 గంటలకల్లా బస్సుల్లో ఎక్కించాలని హుకుం జారీ చేశారు.
ఒక్కో గ్రూపు నుంచి నలుగురు కచ్చితంగా రావాల్సిందేనని బలవంతం చేశారు. ఉదయం 6 గంటలకు బస్సులు పెడతారని.. టిఫిన్, భోజనం పెడతారని.. మీ ఇంట్లోవాళ్లు వస్తామంటే వాళ్లనూ తీసుకురండి అంటూ మెసేజ్‌లు పెట్టారు. జనం రావడమే కావాలి.. మధ్యాహ్నానికి తిరిగి వచ్చేయచ్చంటూ పేర్కొన్నారు. అంతే కాకుండా సభకు రానివారికి రుణాలు ఇవ్వరంటూ చెప్పే ఆడియోలు లీకయ్యాయి.
పాఠశాలలకూ సెలవు..: సీఎం పర్యటన సందర్భంగా కాకినాడ జిల్లా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు అధికారికంగా సెలవు ప్రకటించేశారు. ‘అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలలకు 12వ తేదీన లోకల్ హాలిడేగా ప్రకటించడమైనది’ అంటూ డీఈవో నుంచి సమాచారం అందింది. కారణం పేర్కొనలేదు. సామర్లకోట, పెద్దాపురం మున్సిపాలిటీల్లో తాగునీటి సరఫరా వేళలు సమయం సైతం మార్చేశారు. సభకు జనం వచ్చేలా మంచినీటి సరఫరా తెల్లవారుజామున సరఫరా చేసేలా సమయం మార్చారు.
ముఖ్యమంత్రి రోడ్డు షో, బహిరంగ సభకు పెద్ద ఎత్తున జనాన్ని తరలించేందుకు ఆర్టీసీ, ప్రైవేటు విద్యాలయాల బస్సులతో పాటు ఆటోలను సైతం సభకు మళ్లించడంతో సెలవు ప్రకటించేశారు. ఇక పెద్దాపురం రోడ్డులోని హెలిప్యాడ్ నుంచి సామర్లకోటలోని జగనన్న కాలనీకి.. సీఎం జగన్ బస్సులో చేరుకుంటారు. 2.2 కిలో మీటర్ల పొడవున్న రోడ్డు షో మార్గంలో రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ మార్గంలోని దుకాణాలు తెరవకూడదనే ఆంక్షలు విధించారు. నిరసనలకు ఆస్కారం లేకుండా ఎక్కడికక్కడ కట్టడి చేశారు. నిఘా కెమెరాలు, పెద్ద ఎత్తున పోలీసు బలగాలను సిద్ధం చేశారు.
CM Jagan Guntur Tour: కారైనా.. హెలికాఫ్టరైనా.. జగన్ వస్తే ఆంక్షలు కామనే