Illegal Excavations: కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో.. 99 ఎకరాల్లో కోదండరామ చెరువు విస్తరించి ఉంది. ఈ చెరువు పరిధిలో 6 వందల ఎకరాల ఆయకట్టు ఉంది. కొన్నేళ్లుగా దశలవారీ అనుమతులతో గ్రావెల్ తవ్వకాలు సాగుతున్నాయి. పిఠాపురానికి చెందిన అధికార పార్టీ నాయకుడి దన్నుతో.. కాకినాడకు చెందిన అనుచరుడు తవ్వకాలకు తెగబడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పి.కొంతమూరు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి పేరుతో.. 10 వేల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకాలకు జలవనరుల శాఖ నుంచి మే 12న అనుమతులు పొందారు. దీన్ని అడ్డు పెట్టుకుని లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వేశారు.
అనుమతి గడువు ముగియడంతో గత నెల 28న ఏలేరు ఈఈ కార్యాలయం నుంచి అనుమతి పొందారు. వరుస తవ్వకాలతో కోదండరామ చెరువులో 30 నుంచి 40 అడుగల గుంతలు పడటంతో.. పరిస్థితి ప్రమాదకరంగా మారింది. దీనిపై తీవ్రంగా ఆగ్రహించిన రైతులు, జనసేన నాయకులతో కలిసి 4 రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు. వారిని కట్టడి చేయడానికి పోలీసులు ప్రత్యేక బలగాలను మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
మట్టి అక్రమ తవ్వకాలతో పొలాలకు చెరువు నుంచి నీళ్లు అందడం లేదని రైతులు వాపోతున్నారు. ఇంజిన్‌లు వేసి తోడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన చెందుతున్నారు. పెద్ద పెద్ద గోతులతో చెరువు ప్రమాదకరంగా తయారైందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అధికార పార్టీ అక్రమాలకు అంతే లేకుండా పోయిందని.. పంచభూతాల్లో దేన్నీ మిగలకుండా మింగేస్తున్నారని జనసేన నేతలు మండిపడ్డారు. మట్టి అక్రమ తవ్వకాలపై తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే వర్మ ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. నోటీసులు కూడా జారీ చేసింది.
"ఈ చెరువుని 50,60 అడుగుల వరకూ గోతులు తవ్వుతున్నారు. ఎవరు ఎలా పోయినా మాకు పరవాలేదు.. మేము మట్టిని తీసుకుంటాం అనే విధంగా ప్రవర్తిస్తున్నారు". - దుర్గ, రైతు
"ఇక్కడ 100 ఎకరాల కోదండరామ చెరువు ఉండేది. ప్రస్తుతం చూస్తే.. 30 నుంచి 40 ఎకరాలు మాత్రమే ఉంది. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ మట్టి తవ్వకాలు మొదలు పెట్టారు. అప్పుడు గొడవ చేస్తే.. కొన్ని రోజులు ఆపారు. మళ్లీ తరువాత మొదలు పెట్టారు. మా మీద కేసు కూడా పెట్టారు". - బాబ్జీ, రైతు
"70, 80 అడుగుల లోతుకు తవ్వేసి.. మట్టి పట్టుకొని వెళ్లిపోతున్నారు. ఈ కోదండరామ స్వామి చెరువు ఆయకట్టు 2 వేల 200 ఎకరాలు ఉంది. ఇప్పుడు 70,80 అడుగులు లోతుకు మట్టి తవ్వడం వలన.. నీరు కిందకి వెళ్లిపోయింది. ఈ ఆయకట్టులో ఉన్న పొలాలకి నీరు ఎలా పంపించాలి. పేద రైతు నోట మట్టి కొడుతున్నారు". - కందుల దుర్గేష్, జనసేన నేత